Telangana Governor Visits Secretariat Today : గత కొంతకాలంగా ప్రగతిభవన్‌కు.. రాజ్‌భవన్‌కు మధ్య అంతగా పొగడం లేదనే విషయం అందరికీ తెలిసిందే. తెలంగాణ సర్కార్ పంపించిన బిల్లులను గవర్నర్ ఆమోదించకపోవడం.. బహిరంగంగానే ప్రభుత్వంపై గవర్నర్ విమర్శలు చేయడం.. దానికి ప్రభుత్వం కౌంటర్ ఇవ్వడం జరిగింది. అయితే తాజాగా గురువారం రోజున రాష్ట్ర మంత్రిగా పట్నం మహేందర్ రెడ్డి(Patnam Mahender) ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసైలు చాలా రోజుల తర్వాత ఒకే వేదికపై కనిపించారు.
Tamilisai Visits Telangana New Secretariat : రాజ్‌భవన్‌లో పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం గవర్నర్ తమిళిసైతో సీఎం కేసీఆర్.. భేటీ అయ్యారు. రాష్ట్ర నూతన సచివాలయంలో శుక్రవారం రోజున జరగనున్న ప్రార్థనా మందిరాల ప్రారంభోత్సవానికి రావాల్సిందిగా గవర్నర్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించినట్లుగా తెలిసింది. సానుకూలంగా స్పందించిన గవర్నర్.. అందుకు అంగీకరించారు.
తొలిసారిగా నేడు తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయాన్ని(Telangana State New Secretariat) గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ సందర్శించనున్నారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మించిన సచివాలయాన్ని పరిశీలించనున్నారు. ఇవాళ సచివాలయ ప్రాంగణంలో కొత్తగా నిర్మించిన దేవాలయం, మసీదు, చర్చిలను ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనుండగా.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై(Governor Tamilisai) హాజరుకానున్నారు. అయితే రాష్ట్ర నూతన సచివాలయాన్ని నిర్మించిన తర్వాత ఇప్పటి వరకు గవర్నర్ సందర్శించలేదు. ఈ ప్రారంభోత్సవ ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, రోడ్లు భవనాల శాఖ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. ఈ సందర్భంగా నల్ల పోచమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Patnam Mahender Reddy Swearing in Minister : మంత్రిగా పట్నం మహేందర్‌రెడ్డి ప్రమాణస్వీకారం
Nalla pochamma Temple at TS Secretariat : సచివాలయంలోని నల్లపోచమ్మ అమ్మవారి ఆలయం ప్రారంభోత్సవం సందర్భంగా.. గత రెండ్రోజుల నుంచి ఆలయ ప్రతిస్థాపనా క్రతువులు జరుగుతున్నాయి. ఇవాళ ఆలయ ప్రారంభోత్సవం సందర్భంగా.. శాస్త్రోక్తంగా ప్రతిస్థాపన వేడుకలు జరగనున్నాయి. మొదటి రోజు ముందుగా గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ పూజలో రహదార్లు, భవనాల శాఖా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు, సచివాలయ సంఘం అధ్యక్షుడు నరేందర్ రావు దంపతులు పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
Telangana Secretariat Nalla pochamma Temple : రెండో రోజు స్థాపిత పూజ, ప్రతిష్ఠాపన హోమం, తిరుమంజసం, మహాలక్ష్మియాగం, ఫల పుష్పాదివాసం, మహా మంగళహారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఈ పూజలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాల్గొన్నారు. ఇవాళ మూడో రోజు.. చండీయాగం, దిగ్బలి, ప్రాణప్రతిష్టాపన హోమం, ధ్వజస్థంభం, యంత్రప్రతిష్టాపన, విగ్రహాల ప్రతిష్ఠ, ప్రాణపతిష్ఠ, మూడు ఆలయాల శిఖర కుంభాభిషేకం, మహాపూర్ణాహుతి, మహా మంగళహారతి, మహాదాశీర్వచనం ఉండనున్నాయి. మధ్యాహ్నం జరగనున్న ప్రధాన పూజా కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొంటారు.