రాష్ట్రంలోని ప్రతీ యూనివర్సిటీ ప్రోగ్రెస్ కార్డు, బ్లూప్రింట్ తయారు చేయనున్నట్లు గవర్నర్ తమిళిసై తెలిపారు. విద్యుత్ ఆదా వంటి చిన్న చిన్న మార్పులతో.. పర్యావరణంలో మార్పులు తీసుకురావచ్చునన్నారు. యూనివర్సిటీ సిబ్బందితో చర్చల్లో భాగంగా శుక్రవారం జేఎన్ టీయూహెచ్ అధికారులతో రాజ్ భవన్లోని లాన్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆన్ లైన్ తరగతులు పెంచాలని..ఆన్ లైన్ లైబ్రరీ నిర్వహించాలని సూచించారు. లాక్ డౌన్ తర్వాత తరగతులు, పరీక్షల నిర్వహణపై ప్రణాళిక చేయాలని యూనివర్సిటీ అధికారులకు చెప్పారు.
ఇంటర్నల్ పరీక్షలు, వైవా ఆన్ లైన్లో నిర్వహించాలని గవర్నర్ సూచించారు. అనుబంధ కాలేజీల్లో బోధన ప్రమాణాలు మెరుగుపరచాలని.. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కోర్సులు రూపొందించాలని గవర్నర్ తమిళిసై సూచించారు. ఈనెల 21న యోగా డే నిర్వహించాలన్న గవర్నర్...పూర్వవిద్యార్థులను భాగస్వామ్యం చేయాలని తెలిపారు. యూనివర్సిటీలో జరుగుతున్న బోధన, పరిశోధన, తదితర అంశాలను అధికారులు... గవర్నర్కు వివరించారు. యూనివర్సిటీలో ఉద్యోగ ఖాళీలు, ఇతర అంశాలపై ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు గవర్నర్ హామీ ఇచ్చారు. తెలంగాణను ఉన్నత విద్యలో దేశంలోనే అగ్రస్థానంలో ఉండేలా పనిచేయాలని గవర్నర్ దిశానిర్దేశం చేశారు.
ఇదీ చూడండి: పది సప్లిమెంటరీ ఉత్తీర్ణులను రెగ్యులర్‌గా పరిగణిస్తారా?