బోధన ఖాళీల భర్తీకి వెంటనే చర్యలు చేపట్టాలని ఏడు విశ్వవిద్యాలయాల ఉపకులపతులను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆదేశించారు. రూసా పథకంలో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మ్యాచింగ్ గ్రాంట్ విడుదలయ్యేందుకు అవసరమైన ప్రక్రియను విశ్వవిద్యాలయాల వీసీలు వెంటనే చేపట్టాలని గవర్నర్ స్పష్టం చేశారు. రాష్ట్రీయ ఉచ్ఛతార్ శిక్ష అభియాన్... రెండో విడతలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలోని ఏడు యూనివర్సిటీలు, ఐదు డిగ్రీ కళాశాలలకు రూ.242 కోట్లు మంజూరు చేసింది. ఉస్మానియా విశ్వవిద్యాలయానికి రూ.107 కోట్లు, కేయూకి రూ.50 కోట్లు... జేఎన్టీయూహెచ్, మహాత్మగాంధీ, పాలమూరు, తెలంగాణ, తెలుగు యూనివర్సిటీలకు రూ.20 కోట్ల చొప్పున మంజూరు చేసింది.
ఫిర్యాదుపై అధికారులతో గవర్నర్ సమావేశం
రూసా నిబంధనల ప్రకారం మ్యాచింగ్ గ్రాంట్ కింద రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు విడుదల చేయాల్సి ఉంటుంది. వచ్చే మార్చి 31నాటికి రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకపోతే.. కేంద్రం మంజూరు చేసిన నిధులు వెనక్కి పోయే పరిస్థితి ఏర్పడిందన్న ఫిర్యాదుపై అధికారులతో గవర్నర్ సమావేశమయ్యారు. కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన రూసా నిధులను సద్వినియోగం చేసుకునే దిశగా అవసరమైన ప్రక్రియను వెంటనే చేపట్టాలని గవర్నర్ స్పష్టం చేశారు. నిధులు వెనక్కి వెళ్లకుండా జాగ్రత్త పడాలని... రాష్ట్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ విడుదలయ్యేందుకు అవసరమైన ప్రక్రియ నిర్వహించాలని వీసీలను ఆదేశించారు.
ఇదీ చూడండి: రూసా ప్రాజెక్టులు ప్రారంభించిన మోదీ