వాయిదా పడిన పదో తరగతి పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులతో రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు అర్ధాంతరంగా ఆగిపోయాయి.
మధ్యంతర ఉత్తర్వులు ఎత్తివేయాలని కోరుతూ గతంలో దాఖలైన పిటిషన్‌పై విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్ కౌంటరు దాఖలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని.. వాయిదా పడిన పరీక్షలు నిర్వహించేందుకు అనుమతివ్వాలని విద్యా శాఖ కోరింది.
వైద్యుల సూచనల మేరకు కరోనా నివారణకు జాగ్రత్తలు తీసుకున్నట్లు విద్యా శాఖ హైకోర్టుకు నివేదించింది. పరీక్షా కేంద్రాల్లో విద్యార్థుల మధ్య భౌతిక దూరం ఉండేలా చర్యలు తీసుకుంటామని వివరించింది. ఒక్కో బెంచ్ కు ఒక్క విద్యార్థి మాత్రమే ఉంటారని.. ప్రతి విద్యార్థి మధ్య 5 నుంచి 6 అడుగుల దూరం ఉండేందుకు వీలుగా.. గతంలో ఉన్న 2 వేల 530 పరీక్ష కేంద్రాలను 4 వేల 535కి పెంచినట్లు ప్రభుత్వం నివేదించింది. రాష్ట్రవ్యాప్తంగా 26 వేల 442 మంది అదనపు సిబ్బందిని గుర్తించినట్లు తెలిపింది. సుమారు 2వేల మంది వైద్య సిబ్బంది సేవలు కూడా ఉపయోగించుకుంటామని వివరించింది.
విద్యార్థుల కోసం రవాణ ఏర్పాట్లు కూడా చేశామని విద్యాశాఖ హైకోర్టుకు నివేదించింది. సొంత ఊళ్లకు వెళ్లిన హాస్టల్ విద్యార్థులను వెనక్కి తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేశామని పేర్కొంది. విద్యార్థుల హాల్ టికెట్లను రవాణా పాస్‌గా వినియోగిస్తామని తెలిపింది. సీటు విడిచి సీటులో విద్యార్థులు కూర్చునేలా రవాణ ఏర్పాట్లు చేశామని తెలిపింది.
విద్యార్థులు, ఉపాధ్యాయులు కచ్చితంగా మాస్కులు వాడేలా చూస్తామని.. కేంద్రాల వద్ద శానిటైజర్లు ఉంచుతామని విద్యాశాఖ హైకోర్టుకు నివేదించింది. థర్మల్ స్క్రీనింగ్ చేస్తామని.. జ్వరం, దగ్గు, జలుబు ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదిలో ఏఎన్ఎం పర్యవేక్షణలో పరీక్ష రాసేలా ఏర్పాట్లు చేస్తామని వెల్లడించింది. పరీక్షా కేంద్రాలను రోజూ శుభ్రం చేస్తామని వివరించింది.
పిటిషన్‌పై అత్యవసర విచారణ చేపట్టాలని రేపు ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టును కోరే అవకాశం ఉంది.