Telangana Police Recruitment 2022 : తెలంగాణలో పోలీసు ఉద్యోగాలకు రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పోలీసు శాఖలోని పెద్ద ఎత్తున పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయనుంది. కానిస్టేబుల్ పోస్టులతో పాటు వివిధ విభాగాల్లో భారీ స్థాయిలో ఎస్‌ఐ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పోలీసు నియామక మండలి జారీ చేసిన నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 16,027- కానిస్టేబుల్, 587- ఎస్‌ఐ పోస్టులకు నియామాక మండలి నోటిఫికేషన్ విడుదల చేసింది. మే 2వ తేదీ నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు పోలీసు నియామక మండలి ఛైర్మన్ శ్రీనివాసరావు తెలిపారు.
ఇందులో అత్యధికంగా 5,010- టీఎస్‌ఎస్‌పీ కానిస్టేబుల్, 4,965- సివిల్ కానిస్టేబుల్, 4,423- ఏఆర్ కానిస్టేబుల్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. 587 ఎస్‌ఐ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. 414- సివిల్ ఎస్సైల పోస్టులను భర్తీ చేయనుంది. 66 ఏఆర్ ఎస్సై పోస్టులు, 5 రిజర్వ్ సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులు భర్తీ కానున్నాయి. 23- టీఎస్‌ఎస్‌పీ సబ్ ఇన్‌స్పెక్టర్, 12- ఎస్‌పీఎఫ్ సబ్ ఇన్‌స్పెక్టర్, 26- విపత్తు, అగ్నిమాపకశాఖలో ఎస్సై పోస్టులకు నోటిఫికేషన్ వెలువడింది. 8 డిప్యూటీ జైలర్ పోస్టులను భర్తీ చేయనుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు వచ్చే 2వ తేదీ 20వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు విధించారు. నియమ నిబంధనలు, గరిష్ఠ వయసు, విద్యార్హత, రుసుము, సిలబస్ తదితర వివరాలన్ని పోలీస్ నియామక మండలికి చెందిన వెబ్ సైట్లో అందుబాటులో ఉంచారు. అన్ని పోస్టులకు సంబంధించిన రుసుము విషయంలో ఎస్సీ, ఎస్టీలకు రాయితీ ఇచ్చారు.
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలకు లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉంది. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా పోలీసు నియామక మండలి అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. సందేహాల నివృత్తి కోసం ఓ టోల్ ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు.
పోలీస్ ఉద్యోగాలు సాధించాలనుకునే వాళ్లకు... పోలీస్ శాఖ ఇప్పటికే ముందస్తు శిక్షణ ఇస్తోంది. ఫ్రెండ్లీ పోలీసింగ్‌లో భాగంగా... యువతకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు. యువత పోలీస్ ఉద్యోగాల పట్ల ఆసక్తి చూపించేలా... పోలీసులు ప్రత్యేక అవగాహన శిబిరాలు నిర్వహించారు. ఇప్పటికే ప్రీ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహించి... అందులో అర్హత సాధించన వాళ్లకు శిక్షణ ఇస్తున్నారు.
పోలీసు ఉద్యోగాలను ఎలా సాధించాలి.. ఎలా సన్నద్ధం కావాలి, దేహదారుఢ్య పరీక్షల్లో ఎలా ఉత్తీర్ణత సాధించాలనే విషయాలను శిక్షణా శిబిరాల్లో నిపుణులతో తరగతులు చెప్పిస్తున్నారు. పోలీస్ శిక్షణా శిబిరాల్లో తర్ఫీదు పొందుతున్న వాళ్లలో చాలా మంది సులభంగా కానిస్టేబుల్, ఎస్సై ఉద్యోగాలను సాధిస్తున్నారు. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఎక్కువ పోస్టులున్నాయి.
ఇవీ చదవండి: బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్రకు రెండు రోజులు విరామం
గుర్రం 'రంగు' చూసి ఫిదా.. రూ.23లక్షలకు కొనుగోలు.. స్నానం చేయించాక షాక్!