Telangana Government Plan to Conduct Mega DSC : ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు రేవంత్‌రెడ్డి(cm revanth reddy) ప్రభుత్వం మెగా డీఎస్సీ (టీచర్ రిక్రూట్‌మెంట్ టెస్ట్) నిర్వహించాలని భావిస్తోంది. ఈ డీఎస్సీ ద్వారా దాదాపు 9,800 ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయాలని చూస్తోంది. మూడున్నర నెలల క్రితం గత బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో ఖాళీలు ఉండగా, తక్కువ పోస్టులకే ఉద్యోగ ప్రకటన జారీ చేయడంపై నిరుద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
టీటీడీలో ఉద్యోగాలు - ఎంపికైతే భారీగా వేతనాలు!
ఈ క్రమంలోనే తాము అధికారంలోకి వస్తే మెగా డీఎస్సీ నిర్వహిస్తామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ తమిళిసై (Governor tamilisai) ప్రసంగంలోనూ వచ్చే ఆరు నెలల్లో మెగా డీఎస్సీ ద్వారా ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేస్తారని స్పష్టం చేశారు. ఇప్పటికే గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్, దరఖాస్తుల ప్రక్రియ, పరీక్షల నిర్వహణపై ఆర్థిక శాఖ అధికారులతో విద్యాశాఖ అధికారులు సమావేశమై చర్చించారు.
ఈ నేపథ్యంలో ఉపాధ్యాయ ఖాళీలు సుమారు 9,800 ఉంటాయని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేశాయి. రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9,370 ఉపాధ్యాయ పోస్టుల ఖాళీలు ఉన్నాయని, వీటిని డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయాల్సి ఉందని జులైలో గత ప్రభుత్వ మంత్రివర్గ ఉపసంఘానికి విద్యాశాఖ అధికారులు నివేదికలు సమర్పించారు. అందుకు భిన్నంగా 5,089 పోస్టుల భర్తీకి మాత్రమే నోటిఫికేషన్ జారీ అయ్యింది. అంటే 4,281 పోస్టులకు కోత విధించారు.
డిగ్రీ అర్హతతో UIICలో 300 అసిస్టెంట్ ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా!
Mega DSC in Telangana : రాష్ట్రంలో మొత్తం మంజూరైన ఉపాధ్యాయ పోస్టులు 1,22,386 కాగా, ప్రస్తుతం 1,03,343 మంది పని చేస్తున్నారు. అంటే 19,043 టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వాటిల్లో స్కూల్ అసిస్టెంట్‌లో 70 శాతం, హెచ్‌ఎం ఖాళీలన్నింటినీ పదోన్నతుల ద్వారానే భర్తీ చేయాల్సి ఉంటుంది. గత నోటిఫికేషన్ సమయంలోనే పదోన్నతుల ద్వారా 2162 ప్రాథమిక పాఠశాలల ప్రధానోపాధ్యాయులు(పీఎస్‌హెచ్‌ఎం), 1947 గెజిటెడ్ ప్రధానోపాధ్యాయులు మరో 5,870 స్కూల్ అసిస్టెంట్ ఖాళీలు కలిపి మొత్తం 9,979 భర్తీ చేస్తామని సర్కారు పేర్కొంది.
నోటిఫికేషన్‌లో ప్రకటించిన పోస్టులతో వీటిని కలిపినా మొత్తం 15,068 అవుతాయి. అంటే 3,975 ఖాళీలకు గండి పడింది. విద్యాశాఖ ప్రతిపాదించిన 9,370తో పాటు గత అక్టోబరులో స్కూల్ అసిస్టెంట్లకు హెచ్‌ఎంలుగా ప్రమోషన్లు ఇవ్వడం వల్ల మరో 450 ఖాళీలు అదనంగా వస్తాయని విద్యాశాఖ అంచనా వేసింది. ఈ లెక్కన 9,820 ఖాళీలు ఉంటాయి.
అనుబంధ నోటిఫికేషన్ ఇస్తేనే ముందుకు : గత నోటిఫికేషన్‌కు సుమారు 1.77 లక్షల దరఖాస్తులు వచ్చాయి. ఎన్నికల నియమావళి కారణంగా రిక్రూట్‌మెంట్ ఆగిపోయింది. ఇప్పుడు ఆ నోటిఫికేషన్ రద్దు చేస్తే సమస్యలు వస్తాయని విద్యాశాఖ భావిస్తోంది. ఈ నేపథ్యంలో అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేయాలని ఆలోచిస్తున్నారు. వచ్చే ఏడాది జూన్‌లో కొత్త విద్యా సంవత్సరం(2024-25) ప్రారంభమయ్యే నాటికి పోస్టుల భర్తీ పూర్తయితే విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని నిపుణులు పేర్కొంటున్నారు. ఉపాధ్యాయ బదీలీలు, పదోన్నతులు పూర్తయితే మరో 8,500 వరకు ఖాళీలు ఏర్పడతాయని విద్యాశాఖ అంచనా వేస్తోంది. అయితే కోర్టు కేసులతో ఆగిపోయిన ఉపాధ్యాయ ప్రమోషన్లకు, డీఎస్సీకి ముడిపెడితే నియామకాలు పూర్తి కావనే సందేహం వ్యక్తమవుతోంది.
ఐటీఐ, డిగ్రీ అర్హతతో IOCLలో 1,603 జాబ్స్- అప్లై చేసుకోండిలా!