Spacetech Policy: అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ ముందుకెళ్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. అంతరిక్ష సాంకేతిక రంగంలోనూ అగ్రగామిగా నిలిచే లక్ష్యంతో విధాన ప్రకటన చేసింది. స్పేస్‌టెక్ ఫ్రేమ్‌వర్క్ 2022ను ప్రకటించింది. సాధారణ కార్యక్రమంలా కాకుండా మెటావర్స్ విధానంలో పూర్తిగా వర్చువల్ పద్ధతిలో ప్రకటన కార్యక్రమం జరిగింది. పరిశ్రమలు, ఐటీ శాఖా మంత్రి కేటీరామారావు, నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్, ఇస్రో ఛైర్మన్ సోమనాథ్, ఇన్ స్పేస్ ఛైర్ పర్సన్ పవన్ గోయెంకా, తదితరులు వర్చువల్ విధానంలో పాల్గొన్నారు. వారి రూపాలను మెటావర్స్ విధానంలో ప్రత్యక్ష ప్రసారం చేశారు. తెలంగాణ విధానాలు, స్పేస్‌టెక్ ఫ్రేమ్ వర్క్‌ను వారు అభినందించారు. స్పేస్ టెక్ తమ ప్రభుత్వ తదుపరి ప్రాధాన్య రంగమని మంత్రి కేటీఆర్ తెలిపారు. 2026 నాటికి అంతరిక్ష పరిశ్రమ 558 బిలియన్ డాలర్లకు చేరుతుందన్న కేటీఆర్.. అందులో మెజార్టీ వాటా అందిపుచ్చుకోవాలని అభిలషించారు. స్పేస్ టెక్ ఎన్ఎఫ్టీ విక్రయాలను కూడా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
కట్టుబడి ఉన్నాం.. మన రాజధాని హైదరాబాద్ అంతరిక్ష అంశాలకు సంబంధించిన కార్యకలాపాల్లో హబ్‌గా మారేందుకు ఇప్పటికే ప్రత్యేకత కలిగి ఉంది. ఏరోస్పేస్, రక్షణరంగ అనుకూల వాతావరణం, అంతర్జాతీయ సరఫరా గొలుసుతో అనుసంధానమై ఉంది. హైదరాబాద్‌కు చెందిన ఎస్‌ఎమ్‌ఈలు ఇస్రో చేపట్టిన ప్రతిష్టాత్మక మార్స్ మిషన్‌కు 30శాతం పరికరాలను సమకూరుస్తున్నాయి. తెలంగాణ అంతరిక్ష విధానం ప్రకటన, దీనిలో భాగంగా చేపట్టిన కార్యక్రమాలతో మేము ఇందుకు అనువైన వాతావరణాన్ని మరింత మెరుగుపరిచి స్పేష్ టెక్నాలజీలో తెలంగాణను ఏకైక గమ్యస్థానంగా మార్చేందుకు కట్టుబడి ఉన్నాం. -కేటీఆర్, తెలంగాణ ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి
తెలంగాణ ప్రభుత్వానికి అభినందనల వెల్లువ: స్పేస్ పరిశ్రమ నుంచి ఆవిష్కరణలు రావాలన్న ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.. సాంకేతికలతో పరిష్కారాలు చూపాలని అన్నారు. స్పేస్ కు సంబంధించి తయారీరంగం కూడా వృద్ధి చెందాలని, స్పేస్ డెబ్రీ సమస్యకు కూడా పరిష్కారం చూపాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. తెలంగాణలో ఇప్పటికే మంచి ఎకో సిస్టం ఉందన్న సోమనాథ్... ఇస్రోకు తెలంగాణ నుంచి చాలా ఉపయుక్తమైనవి వస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వ విధానాలు అంకురాలను మరింతగా ముందుకు తీసుకెళ్తాయని, కొత్త వారు మరింత వృద్ధి చెందేలా అవసరమైన మద్దతు ఇస్తామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పారిశ్రామిక విధానాలు చాలా ప్రోత్సాహకరమైనవని ప్రశంసించిన ఇన్ స్పేస్ సంస్థ ఛైర్ పర్సన్ పవన్ గోయెంకా... స్పేస్ టెక్ ఫ్రేమ్ వర్క్ చాలా సమగ్రంగా ఉందని అభినందించారు. స్పేస్ టెక్‌లో తెలంగాణ ముందడుగు వేయడం సంతోషకరమని నీతిఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ అన్నారు. తొలిసారిగా ప్రభుత్వ కార్యక్రమాన్ని మెటావర్స్ విధానంలో నిర్వహించినందుకు తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించారు.
ఇవీ చదవండి: