door to door covid vaccination: రాష్ట్రంలో వ్యాక్సినేషన్ సంఖ్యను పెంచేందుకు ఆరోగ్య శాఖ ప్రత్యేక కార్యాచరణ మొదలు పెట్టింది. ఇంటింటికీ వెళ్లి టీకాలు వేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. 18 ఏళ్లు దాటిన అర్హులైన టీకా లబ్ధిదారులు 2,77,67,000 మంది ఉండగా.. వీరిలో ఇప్పటి వరకూ తొలిడోసు పొందినవారు 2,58,80,232(93 శాతం) మంది. కొద్దిరోజులుగా టీకాల పంపిణీ మందకొడిగా సాగుతుండగా..మంగళవారం తిరిగి పుంజుకుంది. ఈ నెల 7న 3,70,863 డోసులను పంపిణీ చేశారు. ఇందులో తొలిడోసు స్వీకరించినవారు 2,04,718 మంది కాగా.. రెండుడోసులు తీసుకున్నవారు 1,66,145 మంది ఉన్నారు. రాష్ట్రంలో పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య 3,96,12,257కు పెరిగిందని వైద్యశాఖ మంగళవారం తాజా గణాంకాలు విడుదల చేసింది.
రెండోడోసులో వెనుకంజ..
తొలిడోసు పంపిణీలో కొంత మెరుగ్గా ఉన్నా.. రెండోడోసు అందజేతలో మాత్రం ఆరోగ్యశాఖ వెనుకబడి ఉంది. అర్హులైన మొత్తం లబ్ధిదారుల్లో ఇప్పటి వరకూ కేవలం 1,37,32,025 (49 శాతం) మందే రెండోడోసు స్వీకరించారు. రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్ జిల్లాల్లో తొలిడోసు పంపిణీ 100 శాతాన్ని అధిగమించగా.. ఇవే జిల్లాల్లో రెండోడోసు పొందడానికి జనం ముందుకు రావడంలేదు. హైదరాబాద్‌లో 75 శాతం, రంగారెడ్డిలో 71, మెదక్‌లో 44 శాతం మాత్రమే రెండుడోసులు స్వీకరించారు. ఇటీవలే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ నేతృత్వంలో ఉమ్మడి ఆదిలాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. టీకాల పంపిణీలో వెనుకబడిన జిల్లాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని ఆదేశించారు. దీంతో రెండు రోజులుగా టీకాల పంపిణీ జోరందుకుంది. అంతకుముందు రోజుకు సుమారు 2.5లక్షల టీకాల పంపిణీ జరుగుతుండగా.. గత రెండు రోజులుగా రోజుకు 3.5 లక్షలకు పైగా టీకాలు అందజేస్తున్నారు.
అందుబాటులో లక్షల డోసులు..
ఇప్పటికీ రాష్ట్రంలో 47,24,920 కొవిషీల్డ్, 14,17,370 కొవాగ్జిన్ డోసులు అందుబాటులో ఉన్నాయి. రెండూ కలిపి మొత్తగా 61,42,290 డోసులుండడంతో.. అర్హులందరికీ టీకాలను అందజేయడాన్ని మరింత వేగవంతం చేయాలని వైద్యసిబ్బందికి ఆదేశాలు జారీచేశారు. ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించిన నేపథ్యంలో.. టీకాలు పొందనివారు తక్షణమే స్వీకరించడానికి ముందుకు రావాలని వైద్యఆరోగ్యశాఖ కోరింది.
ఇదీ చూడండి: Swachh Survekshan: పరిశుభ్రమైన నగరాలే లక్ష్యంగా పురపాలక శాఖ దిశానిర్దేశం..