Telangana Govt Angry On Andhra Pradesh Over Polavaram: పోలవరం ప్రాజెక్టు ముంపు విషయమై కేంద్ర జలసంఘం ఆదేశాలకు అనుగుణంగా సమావేశం నిర్వహించి చర్చించనందుకు ప్రాజెక్టు అథారిటీ, ఆంధ్రప్రదేశ్‌పై తెలంగాణ అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ నెల పదో తేదీన సమావేశం నిర్వహించి ముంపు విషయమై చర్చించాలని పీపీఏను సీడబ్ల్యూసీ ఈ నెల మూడో తేదీన ఆదేశించింది. సమావేశం కోసం తమ అభ్యంతరాలు, సమాచారాన్ని తెలంగాణ ప్రభుత్వం ఈ నెల ఆరో తేదీన ప్రాజెక్టు అథారిటీకి పంపింది.
పదో తేదీకి బదులుగా ఇవాళ మధ్యాహ్నం వర్చువల్ విధానంలో పీపీఏ సమావేశం నిర్వహించింది. తెలంగాణ, ఏపీ ఇంజనీర్లు సమావేశానికి హాజరయ్యారు. అయితే తెలంగాణ నుంచి వచ్చిన సమాచారాన్ని తమకు పీపీఏ ఇవాళ మధ్యాహ్నం పంపిందని.. దానికి సమాధానం ఇచ్చేందుకు కొంత సమయం కావాలని ఏపీ ఇంజనీర్లు కోరారు. ఈ పరిణామంపై తెలంగాణ ఇంజినీర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ముంపు సంబంధిత సమాచారాన్ని తాము ఇప్పటికే పలు దఫాలుగా పీపీఏకు పంపామన్న తెలంగాణ ఇంజనీర్లు... అథారిటీ కూడా వాటిని ఏపీకి పంపిందని పేర్కొంది.
Polavaram Meeting: ఇటువంటి కీలకమైన అంశాల్లో జాప్యం తగదని తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా నిరసన తెలిపింది. ప్రాజెక్టు అథారిటీ, ఏపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని తెలంగాణ తీవ్రంగా ఆక్షేపించింది. తమ నుంచి సమాచారాన్ని ఈ నెల 14వ తేదీ వరకు పంపుతామని ఏపీ పేర్కొంది. దీంతో ఈ నెల 15వ తేదీన ప్రత్యక్షంగా సమావేశాన్ని నిర్వహించాలని కోరిన తెలంగాణ ఇంజినీర్లు.. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఉమ్మడి సర్వే చేపట్టాలని డిమాండ్ చేశారు. మరి ఏ రకంగా పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముందుకు సాగుతుందో వేచి చూడాలి.
మూడు నెలలు సమయం కోరిన కేంద్రం: పోలవరం ముంపుపై దాఖలైన పిటిషన్ల విచారణను మూడు నెలలు పాటు వాయిదా వేయాలని సుప్రీంకోర్టును కేంద్రం కోరింది. అందుకు తగిన వినతి పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్పించింది. పోలవరం ముంపునకు గురవుతామని ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ ప్రభుత్వాలు దాఖలు చేసిన పిటిషన్లు సోమవారానికి విచారణకు వచ్చింది. అందుకు కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు ఈ విధంగా లేఖ రాసింది. మొదటి నుంచి పోలవరం ప్రాజెక్టు వల్ల ముంపునకు గురవుతామని ఈ మూడు రాష్ట్రాలు భిన్న అభిప్రాయాలను వ్యక్తం చేశాయి.
ఇవీ చదవండి: