Telangana Government Focus on Central Funds : వచ్చే ఆర్ధిక సంవత్సరానికి బడ్జెట్ (Telangana Budget 2024)కసరత్తు ప్రారంభించిన రాష్ట్ర ప్రభుత్వం, కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకోవడంపై దృష్టి సారించింది. అవసరాలకి సరిపడా ఆదాయం లేని పరిస్థితిలో, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత ఎక్కువమేర నిధులు రాబట్టుకుంటే అంత మేలన్న ఆలోచనలో సర్కార్ ఉంది. అందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే వివిధ పథకాల ద్వారా, ఎక్కువగా నిధులను పొందేలా కార్యాచరణ సిద్ధం చేస్తోంది.
కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవడం ద్వారా, ఎక్కువ నిధులు రాబట్టుకోవచ్చని భావిస్తోంది. ఆర్థికశాఖపై ఇటీవలే సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఆ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు. కేంద్రం నుంచి వీలైనన్ని గ్రాంట్లు రాబట్టేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖలు, పథకాల వారీగా కేంద్రం అందించే మ్యాచింగ్ గ్రాంట్‌ని 100 శాతం సద్వినియోగం చేసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు.
CAG Report on State Finance: బడ్జెట్ నిర్వహణ తీరు బాగోలేదు.. కాగ్ ఆక్షేపణ
కొంత మేరకు రాష్ట్రం వాటా చెల్లిస్తే, కేంద్రం తన వంతు వాటాగా ఇచ్చే నిధులను ఎట్టి పరిస్థితుల్లో వదులుకోవద్దని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy) స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వానికి పేరు వస్తుందనో, రాష్ట్ర సర్కార్‌కి పెద్దగా పేరు వచ్చేది లేదన్న బేషజాలకు పోవద్దని రేవంత్‌రెడ్డి అధికారులకు సూచించారు.
వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునే అంశంపై ఆర్థికశాఖ చర్యలు : ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశాలతో, కేంద్రం నుంచి వీలైనన్ని ఎక్కువ నిధులు రాబట్టుకునే అంశంపై ఆర్థికశాఖ (TS Finance Department)చర్యలు ప్రారంభించింది. రానున్న బడ్జెట్ కోసం ఇప్పటికే ప్రతిపాదనలు కోరిన ఆర్థికశాఖ, కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించింది. రాష్ట్రంలో అమలు చేయగలిగిన కేంద్ర పథకాలను అన్నిశాఖలు గుర్తించాలని తెలిపింది.
Special Grants to Telangana : కేంద్రంపై తెలంగాణ ఆశ.. నిధులు అందక నిరాశ
ఆయా పథకాలను 2024-25 ఆర్థిక సంవత్సరంలో తెలంగాణలో అమలు చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆర్థికశాఖ స్పష్టం చేసింది. ఆ పథకాలతో రాష్ట్రానికి వచ్చే నిధుల మొత్తం, అందుకు తెలంగాణ ప్రభుత్వం ఇవ్వాల్సిన వాటా వివరాలను, బడ్జెట్ ప్రతిపాదనల్లో స్పష్టంగా పేర్కొనాలని ఆర్థికశాఖ తెలిపింది. పలు కేంద్ర పథకాల ద్వారా తెలంగాణలో ఇప్పటివరకు ఏడాదికి రూ.10,000ల కోట్ల వరకు వస్తున్నట్లు సమాచారం.
మరో రూ.5 వేల కోట్లు వచ్చే అవకాశం : మరికొన్నింటికీ రాష్ట్ర వాటా విడుదల చేయనందున, ఆ నిధులు రాలేదని తెలుస్తోంది. రాష్ట్రంలో అమలు చేయగలిగిన అన్ని కేంద్ర ప్రభుత్వ పథకాలకు, రాష్ట్ర వాటా విడుదల చేస్తే ప్రస్తుతం వస్తున్న రూ.10,000ల కోట్లకి అదనంగా మరో రూ.5000ల కోట్లను కేంద్రం నుంచి రాబట్టుకోవచ్చని సర్కార్ అంచనా వేస్తుంది. విద్య, వైద్యం, వ్యవసాయం తదితర శాఖల్లో అదనపు నిధులు పొందవచ్చని భావిస్తుంది.
రాష్ట్ర ఆర్థికశాఖపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష - '2024-25 బడ్జెట్లో వాస్తవాలు ప్రతిబింబించాలి'