రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త తెలిపింది. ఎట్టకేలకు మొక్కజొన్న కొనుగోలుకు మార్గం సుగమమైంది. మక్కల కొనుగోళ్ల కోసం తెలంగాణ రాష్ట్ర సహకార మార్కెటింగ్ సమాఖ్యను నోడల్ ఏజెన్సీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఏడాది ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్ ముగియనున్న తరుణంలో 2020-21 రబీ మార్కెటింగ్ సీజన్‌పై ప్రత్యేక దృష్టి సారించింది. మక్కల కొనుగోళ్లకు అవసరమైన రూ.534.22 కోట్ల రుణం మంజూరు కోసం ఎన్‌సీడీసీ, బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థలకు పూచీకత్తు ఇచ్చింది. 2 శాతం హామీ కమీషన్ చెల్లింపునకు లోబడి ఉంటుంది.
రాష్ట్రంలో సుమారు 2,29,783 ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న పంట సాగు చేయగా... ఎకరానికి దిగుబడి 21.5 క్వింటాళ్ల చొప్పున 4,94,033.99 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రావొచ్చని అంచనా. దీనిలో 2,47,017 మెట్రిక్ టన్నుల మేర కొనుగోలు చేయాలన్న విజ్ఞప్తుల దృష్ట్యా... కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయనుంది. వానా కాలం తరహాలోనే యాసంగిలోనూ మద్దతు ధరలు చెల్లిస్తున్న నేపథ్యంలో రాబోయే సీజన్ కోసం ఇప్పటినుంచే మార్క్‌ఫెడ్ సన్నాహాలు చేస్తోంది.
రైతుల ప్రయోజనార్థం కనీస మద్దతు ధర కింద మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ మొదలుపెట్టేందుకు సర్కారు జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టీఎస్ మార్క్‌ఫెడ్ వ్యవహరించనుంది. ఇప్పటికే క్షేత్రస్థాయిలో చాలా గ్రామాల్లో ప్రైవేటు వ్యాపారులు, దళారులు తక్కువ ధరలకు రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేయగా కేంద్రాలు తెరిచే సమయానికి చాలా వరకు సరుకు అమ్ముడుపోయిందన్న విమర్శలు ఉన్నాయి.
ఇదీ చదవండి: రాష్ట్రంలో కొత్తగా 631 కరోనా కేసులు