కాలుష్య నియంత్రణే లక్ష్యంగా ఎలక్ట్రిక్ వాహనాలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రాయితీలపై జనం ఆసక్తిగా ఉన్నా.. వాటి అమలుకు సంబంధించి ఉత్తర్వులు ఇంకా జారీ కాలేదు. అవి ఎప్పుడొస్తాయా అని అంతా ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో విద్యుత్తు వాహనాలను ప్రోత్సహించేందుకు అక్టోబరులో ‘తెలంగాణ స్టేట్ ఎలక్ట్రిక్ వెహికల్ అండ్ ఎనర్జీ స్టోరేజ్ పాలసీ 2020-30’ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ఆవిష్కరించింది. దీని ప్రకారం బ్యాటరీ(రీఛార్జి) ఆధారంగా నడిచే వాహనాల జీవితకాల పన్నుపై నూరు శాతం రాయితీ ఇవ్వాలని నిర్ణయించింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పూర్తిగా రద్దు చేయనున్నట్లు స్పష్టంచేసింది. ఇది కార్యరూపంలోకి రావాలంటే రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంది. నెలన్నర కావొస్తున్నా.. ఇంత వరకు ఉత్తర్వులు రాకపోవటంతో, వాహనాలు కొనాలనుకునేవారు, డీలర్లు రవాణా శాఖ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు.
ప్రోత్సాహకాలివే..
రాష్ట్రంలో కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకున్న ద్విచక్ర వాహనాలు, కార్లు, సరుకు రవాణా, ప్రజారవాణాకు వినియోగించే బస్సులు, ఆటోలు, వ్యవసాయ పనులకు వినియోగించే ట్రాక్టర్లకు 100% జీవిత కాల పన్ను, రిజిస్ట్రేషన్ ఛార్జీలను రద్దు చేయాలని నిర్ణయించింది. అది కూడా ఆయా వాహన విభాగాల్లో తొలిదశలో నిర్దేశిత సంఖ్యలో ముందస్తుగా కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేసుకున్న వాహనాలకే ఈ రాయితీలు వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. వాహన, బ్యాటరీ తయారీదారులను కూడా ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ చర్యలతో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది.
పెరుగుతున్న ఆసక్తి
ఎలక్ట్రిక్ వాహనాలపై ప్రజల్లో ఆసక్తి పెరుగుతోంది. ద్విచక్ర వాహనాల విషయంలో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది. రాయితీ విధానంపై రవాణా శాఖ దస్త్రాన్ని రూపొందించి ప్రభుత్వానికి పంపింది. వివిధ శాఖల మధ్య ఆ దస్త్రం చక్కర్లు కొడుతోంది.
ఇదీ చదవండి: 'భవానీ దీక్షల విరమణకు ఏర్పాట్లు పూర్తి'