Khelo India Winter Games 2023: కశ్మీర్‌లోని గుల్మార్గ్‌లోని మంచు లోయలో 3వ ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ఫిబ్రవరి 10న మొదలైన విషయం తెలిసిందే. ఈ రోజుకు ఈ వింటర్ గేమ్స్ నాలుగో రోజుకు చేరాయి. ఈ ఉదయం మంచులో ఐస్ స్కేటింగ్, స్పీడ్ స్కేటింగ్ ఆటల పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో దేశంలోని వివిధ రాష్ట్ర క్రీడాకారులు పాల్గొన్నారు. అందులో తెలంగాణ వారు సైతం బంగారు పతకాలు సాధించారు. ఈ క్రీడాకారులు ఈటీవీ భారత్ ప్రతినిధితో మాట్లాడి వారి విజయం గురించి తెలిపారు.
తెలంగాణకు చెందిన క్రీడాకారిణి నైనా శ్రీ ఈ వింటర్ గేమ్స్‌లో పాల్గొని 500 మీటర్లు, 1000 మీటర్ల విభాగంలో రెండు బంగారు పతకాలను సాధించారు. రాష్ట్రానికి చెందిన క్రీడాకారిణి నైనా శ్రీ మాట్లాడుతూ... ఈ పోటీ కోసం నేను ఎంతో కష్టపడ్డాను. ఇక్కడ చలిని తట్టుకుని పోటీల్లో పాల్గొన్నాను. వారం క్రితమే గుల్మార్గ్ వచ్చి.. ఇక్కడే ప్రాక్టీస్ చేయడంతో పోటీలో పాల్గొనడం సులువైంది. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చి ఈ పోటీల్లో పాల్గొన్నారు. ఇక్కడ కనిష్ట ఉష్ణోగ్రత 7 డిగ్రీల వరకు ఉంటుంది. ఈ వాతావరణంలో గేమ్స్ ఆడటం.. కొంచెం కష్టంతో కూడుకున్నది'' అంటూ తెలిపారు.
''నేను మొదటిసారిగా ఖేలో ఇండియాలో పాల్గొన్నాను. ఇక ఈ పోటీల్లో రెండు బంగారు పతకాలు సాధించినందుకు చాలా హ్యాపీగా ఉంది. నా విజయం వెనుక నా కోచ్ శ్రమ ఉంది. వచ్చే ఏడాది వింటర్ ఒలింపిక్స్ జరగనున్నాయి. భారత్ నుంచి పోటీల్లో పాల్గొనాలని ఉంది. దీనికోసం నా వంతు కృషి చేసి.. ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధిస్తాను.'' - నైనా శ్రీ , తెలంగాణ క్రీడాకారిణి
మహారాష్ట్రకు చెందిన సురాలి దేవ్ కూడా సీనియర్ విభాగంలో స్పీడ్ స్కేటింగ్ ఈవెంట్‌లో 500, 1000 మీటర్ల పరుగులో రెండు బంగారు పతకాలు సాధించారు. ఈ కుర్రాడు మాట్లాడుతూ... ఐస్ రింక్ గేమ్‌లో పాల్గొన్నప్పుడు కాస్త కష్టంగా అనిపించింది. అయితే ట్రాక్ చాలా బాగుంది. దీనిని జమ్ము కశ్మీర్ యూత్ స్పోర్ట్స్ కౌన్సిల్ చక్కగా నిర్వహించారు. ఖేలో ఇండియా క్రీడలు దేశంలోని క్రీడాకారులకు ఎంతో ప్రాముఖ్యత నిస్తాయి. ఈ పోటీల్లో ఎక్కువ మంది పాల్గొనడానికి రావాలి. క్రీడలకు, క్రీడాకారులకు తగిన గౌరవం దక్కాలి.'' అని తెలిపారు.
ఇవీ చదవండి: