vittal joined in bjp : తెలంగాణ ఉద్యోగ సంఘాల మాజీ నేత విఠల్ కాషాయం కండువా మెడలో వేసుకున్నారు. కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ, భాజపా రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్ చుగ్ సమక్షంలో ఆయన భాజపాలో చేరారు. బంగారు తెలంగాణ ఆశయాన్ని పక్కనపెట్టి.. కుటుంబం, సొంత వారి ఆస్తులు పెంచడానికి కేసీఆర్ కృషి చేస్తున్నారని తరుణ్ చుగ్ విమర్శించారు. దేశంలో ఒకవైపు కుటుంబ రాజకీయాలు పెంచి పోషించేందుకు ప్రయత్నిస్తుంటే.. భాజపా మాత్రం ప్రజాస్వామ్యం బలోపేతం కోసం కృషి చేస్తోందని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తెలిపారు. ఉద్యోగాలు భర్తీ చేయడంలో తెరాస పూర్తిగా విఫలమైందన్న భాజపా నేతలు.. మిగులు బడ్జెట్ ఉన్న రాష్ట్రాన్ని దివాలా తీయించారని మండిపడ్డారు.
నిజమైన ఉద్యమకారులంతా భాజపాలోకి రావాలని బండి సంజయ్ పిలుపునిచ్చారు. అసలైన ఉద్యమకారులకు అన్యాయం చేస్తూ... ఉద్యమ ద్రోహులకు కేసీఆర్ పెద్దపీట వేస్తున్నారని ఆరోపించారు. రేపు తీన్మార్ మల్లన్న పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
'తెలంగాణలో నిజమైన ఉద్యమకారులందరికీ భాజపా వేదికగా మారింది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు నిజమైన ఉద్యమకారులను తెరమరుగు చేస్తున్నారు. కనీసం వాళ్లను పట్టించుకోకుండా.. తెలంగాణ ఉద్యమ ద్రోహులు ఎవరైతే ఉన్నారో వారిని చేరదీస్తూ.. మంత్రులు, ఎమ్మెల్యేలను చేస్తున్నారు. తెలంగాణ ప్రజలను మోసం చేస్తూ.. ఇబ్బంది పెడుతున్న విషయం అనేక సందర్భాల్లో స్పష్టమైంది. తీన్మార్ మల్లన్న రేపు భాజపాలో చేరనున్నారు. నిజమైన ఉద్యమకారులు ఎవరైనా కూడా రండి భాజపాలోకి' - బండి సంజయ్, భాజపా రాష్ట్ర అధ్యక్షుడు
ఇదీ చూడండి: Etela Rajender on cm kcr: 'దేశంలోనే అసమర్థ సీఎం కేసీఆర్ అని సర్వేలో తేలింది'