వచ్చే విద్యా సంవత్సరానికి(2021-22) ఎంసెట్ సహా ఇతర ప్రవేశ పరీక్షలను జూన్‌లో నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి భావిస్తోంది. సాధారణంగా ఏటా మే నెలలో ప్రవేశ పరీక్షలు జరుపుతారు. ఈ ఏడాది కరోనా కారణంగా ఎంసెట్ సహా మరికొన్ని ఇతర ప్రవేశ పరీక్షలు సెప్టెంబరు, అక్టోబరు మొదటివారంలో జరిపారు. కొవిడ్ ప్రభావంతో ఇప్పటివరకు జూనియర్ కళాశాలలు తెరుచుకోలేదు. ఆన్‌లైన్ తరగతులే కొనసాగుతున్నాయి.
ఈ పరిస్థితుల దృష్ట్యా ఈసారి ఇంటర్ పరీక్షలు ఏప్రిల్ నెలాఖరులో ప్రారంభించి, మే రెండో వారానికి పూర్తిచేయాలని ప్రభుత్వం గత నవంబరులో సూత్రప్రాయంగా నిర్ణయించింది. దాని తర్వాత కనీసం 15-20 రోజుల వ్యవధి ఇచ్చి జూన్‌లో ఎంసెట్ నిర్వహించాలని ఉన్నత విద్యామండలి యోచిస్తోంది. ఇంటర్ పరీక్షలు ఎప్పుడనేది తేలాక దీనిపై స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. ‘కేంద్రం ప్రకటించిన ప్రకారం నాలుగో విడత జేఈఈ మెయిన్ మే నెల 24-28వ తేదీ వరకు జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష జూన్ నెలాఖరు లేదా జులై మొదటివారంలో నిర్వహించే అవకాశం ఉంది. నీట్ ఎప్పుడనేది తేలలేదు. వాటిని కూడా పరిగణనలోకి తీసుకుని పరీక్షల తేదీల కాల పట్టికలను వెల్లడించే అవకాశం ఉందని’ అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి: ఘనంగా సీఎం కేసీఆర్ దత్తపుత్రిక ప్రత్యూష వివాహం