ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటనే క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. శాసనసభలో సీఎం మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని కరోనాతో పోల్చడం సిగ్గుచేటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేసీఆర్ పిట్ట కథలు చెప్పడం, ప్రజల్ని మభ్యపెట్టడం మానుకోవాలని సూచించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా నివారణ చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ శాసన సభాపక్షం సభలో ప్రశ్నిస్తే.. కేసీఆర్ మాత్రం... భూత వైద్యుడిలా సభలో ప్రవర్తించారని భట్టి ధ్వజమెత్తారు. కరోనా వైరస్ సోకిన వ్యక్తిని జనావాసాలకు దూరంగా ప్రత్యేక గదిలో ఉంచాలని.. కానీ నగరం నడిబొడ్డునున్న గాంధీ ఆస్పత్రిలో ఉంచారని ఆక్షేపించారు.
కేసీఆర్ ప్రజల్లో విశ్వాసం లేని వ్యక్తిగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అభివర్ణించారు. కుటుంబ పాలనతో రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆరోపించారు. ప్రతిపక్ష సభ్యులకు గౌరవం ఇవ్వాలని సూచించారు.
కేసీఆర్ మాటలు ప్రజల్లో అనుమానాలు రేకెత్తిస్తున్నాయని ఎమ్మెల్యే సీతక్క అన్నారు. కరోనా వల్ల ప్రపంచమంతా భారతీయ సంప్రదాయమైన నమస్కారం చేస్తున్నారన్నారు. ప్రజలకు భరోసా కల్పించేలా సీఎం వ్యవహరించాలని సూచించారు.
ఇవీచూడండి: 'కరోనా నియంత్రణకు కేంద్రం అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది'