Telangana Congress MLA Tickets Disputes : కాంగ్రెస్‌లో అసమ్మతిని నియంత్రించడం పార్టీ నాయకత్వానికి తలనొప్పిగా మారింది. టిక్కెట్ల దక్కవని కొందరు, దక్కలేదని మరికొందరు పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే మెదక్ డీసీసీ అధ్యక్షుడు తిరుపతిరెడ్డి, మల్కాజిగిరి అధ్యక్షుడు నందికంటి శ్రీధర్, పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య , నాగం జనార్దన్ రెడ్డి, మైనారిటీ నాయకుడు సోహైల్, మాజీ ఎమ్మెల్యే విష్ణు వర్ధన్ రెడ్డి , మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, రేగిడి లక్మారెడ్డి , సోమశేఖర్ రెడ్డి తదితరులు పార్టీకి రాజీనామా చేశారు. మరికొందరు అదే దిశలో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. మొదటి విడత కంటే రెండో జాబితా విడుదల తర్వాత పరిస్థితులు తీవ్రంగా మారాయి. పీసీసీ అధ్యక్షుడికి దగ్గరగా ఉంటే టికెట్స్ దక్కుతాయనుకున్న వారిలో ఎక్కువ మందికి నిరాశనే మిగిలింది.
Balmuri Venkat Latest News : హుజూరాబాద్ టికెట్ ఆశించిన ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బలమూరు వెంకట్‌ను కాదని ప్రణవ్‌కు టికెట్ ఇవ్వడంతో.. వెంకట్ అసంతృప్తితో పార్టీకి దూరంగా ఉన్నారు. జడ్చర్ల టికెట్ ఆశించిన ఎర్ర శేఖర్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. దేవరకద్ర టిక్కెట్ ఆశించిన ప్రదీప్ కుమార్ గౌడ్ తీవ్ర నిరాశతో ఉన్నట్లు తెలుస్తోంది. మహేశ్వరం టిక్కెట్టు రాకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న పారిజాత నరసింహారెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నట్లు ప్రకటించారు.
Revanth Reddy Meet Prof Kodandaram : 'తెలంగాణకు పట్టిన చీడ పీడ వదలాలంటే కోదండరామ్ సహకారం అవసరం'
Telangana Congress Disputes 2023 : మునుగోడు టికెట్ దక్కక తీవ్ర నిరాశకు గురైన చలమల కృష్ణారెడ్డి.. అనుచరులతో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. ఎల్బీనగర్లో నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తూ టికెట్ ఆశించిన మల్‌రెడ్డి రామిరెడ్డికి నిరాశనే మిగిలింది. ఆయన బదులు ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కికి టికెట్ దక్కింది. తీవ్ర నిరాశకు గురైన మల్‌రెడ్డి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఇలా ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురు టికెట్ దక్కని అసంతృప్తి నాయకులు ఉండడంతో.. వారందరినీ సముదాయించి దారికి తెచ్చుకోకపోతే పార్టీకి తీవ్రనష్టం ఉంటుందని రాష్ట్ర నాయకత్వం అంచనా వేస్తోంది.
పార్టీకి నష్టం కలిగించే పరిస్థితులు ఉత్పన్నం కావడంతో ఏఐసీసీ, పీసీసీ నష్ట నివారణ చర్యలు చేపట్టాయి. అసంతృప్త నాయకులను పార్టీ పెద్దలు ఎక్కడికక్కడ సముదాయిస్తున్నారు. జానారెడ్డి నేతృత్వంలోని నలుగురు సభ్యుల సమన్వయ కమిటీతోపాటు ఏఐసీసీ నియమించిన ఐదుగురు ప్రత్యేక పరిశీలకులు, పార్టీ సీనియర్ నాయకులు మల్లు రవి, వేం నరేందర్ రెడ్డి, కోదండ రెడ్డి, చరణ్ కౌశిక్ తదితరులు అసంతృప్తి నేతలను సముదాయిస్తున్నారు.
ప్రధానంగా అభ్యర్థులు.. ఎక్కడైతే గెలిచేందుకు అవకాశం లేదో.. అలాంటి నియోజకవర్గాలలో మార్పుపై పార్టీ పునరాలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘకాలంగా పార్టీ బలోపేతానికి కృషిచేస్తూ.. టికెట్ దక్కకపోవడంతో అసంతృప్తికి గురవుతున్న నేతల నుంచి.. టికెట్ దక్కిన వారికి సరైన మద్దతు లభించడం లేదు. దీంతో గెలిచే స్థానాలు చేజేతులారా పోగొట్టుకుంటున్న పరిస్థితులు ఉత్పన్నమవుతున్నట్ల రాష్ట్ర నాయకత్వం అంచనాకు వచ్చినట్లు సమాచారం. తాజా పరిస్థితులు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి అభ్యర్థుల మార్పు విషయమై ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది .