Telangana Congress MLA Tickets Disputes 2023 : కాంగ్రెస్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల తర్వాత ఉమ్మడి పాలమూరు జిల్లాలో అసమ్మతి రాజుకుంటోంది. పూర్వ మహబూబ్‌నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలుండగా 8 స్థానాల్లో అభ్యర్ధుల్ని ప్రకటించారు. కాగా నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా జూపల్లి కృష్ణారావును ప్రకటించడాన్ని అక్కడి నియోజకవర్గ ఇంచార్జ్ చింతలపల్లి జగదీశ్వర్‌రావు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పార్టీ అధికారంలో ఉన్నా లేకపోయినా, ఇన్నేళ్లు పార్టీని కాపాడుకున్న నాయకుల్ని కాదని కొత్తగా పార్టీలో చేరిన జూపల్లి కృష్ణారావుకు టిక్కెట్టు ఇవ్వడంపై జగదీశ్వరరావు అభ్యంతరం వ్యక్తం చేశారు.
Palamuru Congress MLA Ticket Issues : ఈ మేరకు పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లిలో ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. సర్వే రిపోర్టులను పక్కన పెట్టి, ఇతర పార్టీల నుంచి వలస వచ్చిన నేతలకు టిక్కెట్లను కట్టబెట్టడాన్ని జగదీశ్వరావు తప్పుబట్టారు. కాంగ్రెస్ నుంచి టిక్కెట్టు వచ్చినా, రాకపోయినా కొల్లాపూర్ ఎన్నికల బరిలో ఉంటానని మొదటి నుంచే చెప్పిన జగదీశ్వరావు మరోసారి అదే విషయాన్ని స్పష్టం చేశారు. దీంతో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలుస్తారా..? ఏదైనా పార్టీ నుంచి పోటీ చేస్తారా అన్న అంశాన్ని మాత్రం స్పష్టం చేయలేదు.
మరోవైపు పార్టీ సీనియర్ నేత నాగం జనార్దన్ రెడ్డి సైతం నాగర్‌కర్నూల్ నియోజకవర్గం నుంచి తనకు టిక్కెట్ దక్కకపోవడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. పార్టీని దూషించినవారిని టికెట్లను కేటాయించడం సరికాదన్నారు. నాగర్‌కర్నూల్‌లో మీడియా సమావేశం నిర్వహించిన నాగం.. పార్టీ అధిష్ఠానం, రేవంత్ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తానెప్పుడూ సొంత నిర్ణయం తీసుకోలేదని, కార్యకర్తల అభిప్రాయం మేరకు త్వరలోనే భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు.
Telangana Assembly Elections 2023 : అభ్యర్థులను ప్రకటించని 6 నియోజకవర్గాల్లోనూ పోటీ తీవ్రంగా ఉండటంతో పార్టీ భారీ కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహబూబ్ నగర్ టిక్కెట్ యెన్నం శ్రీనివాస్ రెడ్డికే దక్కుతుందని భావించినా.. మొదటి జాబితాలో ప్రకటించలేదు. అక్కడ బీసీలకు టిక్కెట్ కేటాయించాలని, ముస్లిం అభ్యర్ధికి అవకాశం కల్పించాలనే డిమాండ్లు బలంగా ఉన్నాయి. అందుకోసం సంజీవ్ ముదిరాజ్, ఓబేదుల్లా కొత్వాల్ పోటీపడుతున్నారు. జడ్చర్ల టిక్కెట్ అనిరుద్ రెడ్డికే ఇస్తారని ప్రచారం సాగినా.... ఆ స్థానంపై పీటముడి వీడలేదు. అక్కడి నుంచి మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ టిక్కెట్టు ఆశిస్తున్నారు.నారాయణపేటలోనూ పోటీకి ఎర్రశేఖర్ దరఖాస్తు చేసుకున్నారు.
Telangana Congress MLA Candidates Issues : దేవరకద్ర స్థానం మధుసూదనరెడ్డికి దాదాపుగా ఖరారైందనే ప్రచారం సాగినా.. ఆ స్థానాన్నీ ప్రకటించలేదు. ప్రదీప్ గౌడ్, కొండా ప్రశాంత్ రెడ్డి పోటీపడుతున్నారు. నారాయణపేట నుంచి శివకుమార్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. చిట్టెం నర్సిరెడ్డి మనుమరాలు పర్ణికరెడ్డిని మక్తల్ లేదా నారాయణపేట నుంచి బరిలో నిలపాలన్న ఆలోచన కూడా ఉంది. వనపర్తిలో ఏఐసీసీ కార్యదర్శి చిన్నారెడ్డి, మేఘారెడ్డి పోటీపడుతుండగా, పొన్నాల రాజీనామా ప్రభావంతో ఇక్కడ టిక్కెట్టు కేటాయింపు విషయంలో హస్తం పార్టీ ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది.
ఉమ్మడి పాలమూరు జిల్లాలో 6స్థానాలకు ప్రకటించకపోవడనికి సామాజిక సమీకరణాలు కూడా కారణమని తెలుస్తోంది. మహబూబ్ నగర్ జిల్లాలో మహబూబ్‌నగర్, జడ్చర్ల, దేవరకద్ర నియోజకవర్గాల్లో రెండు రెడ్డి వర్గానికి కేటాయిస్తే ఒక స్థానం బీసీకి, లేదా ముస్లిం మైనారిటీలకు కేటాయించాలనే డిమాండ్ వినిపిస్తోంది. నారాయణపేట జిల్లాలోని నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాల్లో ఒకటి రెడ్డి వర్గానికి కేటాయిస్తే మరొకటి బీసీలకు కేటాయించాలనే డిమాండ్ ఉంది.
తొలుత ప్రకటించిన 8మంది జాబితాలో కల్వకర్తి, కొల్లాపూర్, నాగర్‌కర్నూల్, గద్వాల స్థానాల్ని బీఆర్ఎస్ నుంచి ఇటీవలే హస్తం పార్టీలో చేరిన వారికి కేటాయించారు. ప్రకటించిన 8లో నాలుగు వలస వచ్చిన అభ్యర్ధులకే దక్కాయి. దీంతో పార్టీలో అసమ్మతి ఒక్కసారిగా బుసలుకక్కింది. మిగిలిన 6స్థానాల్లోనూ అలాంటి నిర్ణయమే తీసుకుంటే వ్యతిరేకత తీవ్రమయ్యే అవకాశమూ.. లేకపోలేదు. వీటన్నింటినీ హస్తం పార్టీ పెద్దలు ఎలా ఎదుర్కొంటారో..? సమన్వయం చేసుకుని పార్టీని గెలుపు దిశగా ఎలా నడిపిస్తారో వేచి చూడాల్సిందే.