మాజీ ప్రధాని ఇందిరాగాంధీ వర్ధంతి(Indira Gandhi death anniversary) సందర్భంగా కాంగ్రెస్ నేతలు నివాళులు అర్పించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్‌లోని ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేశారు. కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల బాధ్యుడు మాణికం ఠాగూర్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, గీతారెడ్డి, సీనియర్ నాయకుడు వీహెచ్ సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఇందిరాగాంధీ విగ్రహానికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను గుర్తు చేసుకున్నారు.
మాజీ ప్రధానమంత్రి దివంగత ఇందిరా గాంధీ 37వ వర్ధంతి సందర్భంగా.. కాంగ్రెస్ ప్రముఖులు నివాళులు అర్పించారు. దిల్లీలోని శక్తిస్థల్ను సందర్శించిన రాహుల్ గాంధీ.. ఇందిరాకు పుష్పాంజలి ఘటించారు. ఆమె సాధించిన విజయాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు రాహుల్.
"ఇందిరాగాంధీ తన చివరి క్షణం వరకు దేశానికి సేవ చేశారు. ఆమె జీవితం మాకు స్ఫూర్తిదాయకం. అంతేగాకుండా మహిళా సాధికారతకు ఆమె ఉదాహరణ. ఇందిరా గాంధీ వర్ధంతి సందర్భంగా ఇవే మా ఘననివాళులు."
-రాహుల్ గాంధీ
భారత తొలి మహిళా ప్రధాని ఇందిరా గాంధీనే కావడం విశేషం. ఇందిరా 1966-1977 వరకు ప్రధానిగా పని చేశారు. మరోమారు 1980లో ప్రధానిగా బాధ్యతలు చేపట్టారు. 1984, అక్టోబర్ 31న అక్బర్ రోడ్ లోని ఆమె అధికారిక నివాసంలో ఇద్దరు బాడీగార్డ్స్ కాల్పులు జరపటం వల్ల ఆమె ప్రాణాలు కోల్పోయారు.
ఇదీ చదవండి: మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి రాహుల్ నివాళులు