Telangana Congress Complaints: రాహుల్ గాంధీపై అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఆందోళన ఉద్ధృతం చేసింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ పిలుపుతో అసోం ముఖ్యమంత్రిపై రాష్ట్రంలోని పోలీసు స్టేషన్లలో పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసిన రేవంత్‌రెడ్డి.. అసోం ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయాలని కోరారు. హిమంత బిశ్వశర్మ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి కేసీఆర్.. ఖండిస్తే సరిపోదని తగిన చర్యలు తీసుకునేలా పోలీసులను ఆదేశించాలని డిమాండ్ చేశారు. అవసరమైతే కేబినెట్ సమావేశం ఏర్పాటు చేసి అడ్వొకేట్ జనరల్ సహా న్యాయ నిపుణుల సలహాలు తీసుకోవాలని రేవంత్‌రెడ్డి సూచించారు.
దిగజారుడుతనం..
దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన కుటుంబంపై అసోం సీఎం ఆరోపణలు.. భాజపా దిగజారుడుతనానికి నిదర్శనమని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు విమర్శించారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యతో కలిసి హైదరాబాద్ అంబర్‌పేట పోలీస్ స్టేషన్‌లో అసోం సీఎంపై ఫిర్యాదు చేశారు. రాజకీయ ఎదుగుదల కోసం ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని విమర్శించారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో వర్కింగ్ ప్రెసిడెంట్ గీతారెడ్డి ఫిర్యాదు చేశారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి హద్దులు దాటి వ్యాఖ్యలు చేస్తుండడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు.
తల దించుకునేలా...
ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌కుమార్‌తో కలిసి మాజీ మంత్రి రేణుకా చౌదరి బంజారాహిల్స్ పీఎస్‌లో అసోం సీఎంపై ఫిర్యాదు చేశారు. రాహుల్ గాంధీపై అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. హిమంత బిశ్వశర్మపై భువనగిరి పీఎస్‌లో స్థానిక ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫిర్యాదు చేశారు. దేశ ప్రజలు తలదించుకునేలా భాజపా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు.
ఇదీ చదవండి: 'కాంగ్రెస్‌తో కష్టమే.. కేసీఆర్, స్టాలిన్‌తో కలిసి దిల్లీపై గురి!'