రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలతో అప్రమత్తమైన కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక వ్యవహారాన్ని స్థానిక నాయకత్వానికి అప్పగించిన పీసీసీ...అధికార పార్టీకి దీటుగా నిలబడగలిగే వారినే బరిలో దించాలని నిర్ణయించింది.
ముందస్తు చర్యలు
రిజర్వేషన్లు ఖరారయ్యే వరకు...అభ్యర్థుల ఎంపిక తుది దశకు చేరే అవకాశం లేకపోవడం వల్ల రాష్ట్ర కాంగ్రెస్ ముందస్తు చర్యలు చేపట్టింది. ప్రతి మున్సిపాలిటీలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, వార్డు సభ్యులు, నగర పాలక సంస్థలో మేయరు, ఉపమేయరు, కార్పొరేటర్ పదవులకు అవసరమైన అభ్యర్థుల ఎంపికపై ముగ్గురు సభ్యుల సమన్వయ కమిటీ ఏర్పాటు చేసింది. ఈ కమిటీ.. మున్సిపాలిటీ, నగరపాలక సంస్థల వారీగా పలు దఫాలు సమీక్షలు నిర్వహించింది. ఈ సమీక్షల్లో క్షేత్ర స్థాయి నుంచి అనేక అంశాలు పార్టీ రాష్ట్ర నాయకత్వం దృష్టికి వచ్చాయి.
సమయం సరిపోదు
రిజర్వేషన్లు ఖరారైన మరుసటి రోజునే ఎన్నికల నోటిఫికేషన్ రావడం...ఆ మరుసటి రోజు నుంచే నామినేషన్ల స్వీకరణ.. అభ్యర్థుల ఎంపికకు ఇబ్బందిగా మారతాయని కమిటీ సభ్యులు... పీసీసీ దృష్టికి తెచ్చారు. అభ్యర్థులు.. కుల ధ్రువీకరణ పత్రం పొందడం, మున్సిపాలిటీల్లో, నగరపాలక సంస్థల్లో బకాయిలు ఉంటే వాటిని చెల్లించడం, కొత్తగా బ్యాంకు ఖాతాలు తెరవడం లాంటివి పూర్తి చేయడానికి ఎన్నికల కమిషన్ ఇచ్చిన సమయం సరిపోదని ఆందోళన వ్యక్తం చేశారు.
హైకోర్టులో వ్యాజ్యం
రాష్ట్ర కాంగ్రెస్ తరఫున ఎన్నికల కమిషనర్ నాగిరెడ్డిని కలిసిన నేతలు క్షేత్ర స్థాయిలో ఉత్పన్నమయ్యే వాస్తవ పరిస్థితులను ఆయన దృష్టికి తీసుకెళ్లి రీషెడ్యూల్ చేయాలని కోరారు. ఎన్నికల కమిషన్ ఆశించిన మేర సానుకూలంగా నిర్ణయం తీసుకునే అవకాశం లేదని భావించిన కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎన్నికలు రీ షెడ్యూల్ చెయ్యాలని కోరుతూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.
సానుకూల నిర్ణయం
తాము ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి... న్యాయస్థానం నుంచి తమకు సానుకూల నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నట్లు ఆశాభావం వ్యక్తం చేశారు.
- ఇదీ చూడండి : 'పుర'పోరుకు ఎస్ఈసీ మార్గదర్శకాలు