Telangana Congress Focus: రాష్ట్రంలో రాజకీయ వేడి మొదలైంది. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్న ప్రచారంతో రాజకీయపక్షాలన్నీ వ్యూహాల్లో తలమునకలయ్యాయి. కాంగ్రెస్ కూడా అధికార పార్టీని ఢీకొట్టేందుకు అస్త్రాలను సిద్ధం చేస్తోంది. పార్టీ సిద్ధాంతాలు, విధానాలు ప్రజల్లోకి తీసుకెళ్లేలా కష్టపడి పనిచేయాలని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పార్టీ శ్రేణులకు స్పష్టం చేశారు.
50 లక్షలకు చేరువలో...
దేశంలోనే అత్యధికంగా రాష్ట్రంలో 38 లక్షలకుపైగా డిజిటల్ సభ్యత్వ నమోదు పూర్తి చేసిన కాంగ్రెస్... యాభై లక్షలకు తీసుకెళ్లాలన్న యోచనతో ఉంది. సభ్యత్వ నమోదులో వెనకబడిన పార్లమెంటు నియోజకవర్గాలపై ప్రత్యేకంగా సమీక్షిస్తున్నారు. సికింద్రాబాద్ పరిధిలో సభ్యత్వ నమోదు నత్తనడకన సాగడంపై రేవంత్ రెడ్డి నేతల అలసత్వాన్ని నిలదీశారు. పార్టీ కార్యక్రమాల్లో నిర్లక్ష్యం వహిస్తే పదవులు ఊడతాయని హెచ్చరించారు.
మన ఊరు-మన పోరు...
పార్టీని ప్రజలకు మరింత దగ్గర చేసేందుకు "మన ఊరు-మన పోరు'' నినాదంతో నియోజక వర్గాల వారీగా సభలు నిర్వహించాలని కాంగ్రెస్ నిర్ణయించింది. ఇటీవల పరిగి సభ విజయవంతం కావడంతో మరిన్ని సభలకు పీసీసీ సమాయత్తమవుతోంది. కాంగ్రెస్ బలోపేతమవడాన్ని చూసి తట్టుకోలేకే భయంతో ప్రశాంతకిషోర్‌ను తెచ్చుకున్నారని రేవంత్ ఆరోపించారు. కాంగ్రెస్ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి తెరాస, భాజపాలపై పోరాటం చేయాల్సి ఉందన్న రేవంత్.. పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు.
దేశానికే ఆదర్శం...
రాష్ట్రంలో కాంగ్రెస్ డిజిటల్ సభ్యత్వ నమోదు దేశానికే ఆదర్శంగా ఉందని ఏఐసీసీ ఇంఛార్జి కార్యదర్శి బోసురాజు పేర్కొన్నారు. నాయకులంతా బాధ్యత తీసుకుని సభ్యత్వాలు చేయించాలని సూచించారు. కాంగ్రెస్ ప్రాబల్యాన్ని తగ్గించి ప్రజలను పక్కదోవ పట్టించేందుకు కేసీఆర్, భాజపాలు కలిసి డ్రామాలాడుతున్నాయని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ ఆరోపించారు. ఇప్పుడున్న రాజకీయ వేడి సరిపోదని అందరు కలిసికట్టుగా మరింత బలంగా పోరాడితేనే పార్టీ అధికారంలోకి వస్తుందని కాంగ్రెస్ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.