Telangana CM Revanth Reddy to Sign on Six Guarantees : కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలు ప్రక్రియపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన వెంటనే హామీల అమలుపై సంతకం చేస్తామని ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. రాష్ట్రంలో ఎన్నికల హామీగా కాంగ్రెస్ పార్టీ(Congress Party) ప్రకటించిన ఆరు గ్యారంటీల అమలుకు ఏటా సుమారు రూ. 70 వేల కోట్లు అవసరమని ఆ పార్టీ వర్గాల అంచనా.
వీటి ముసాయిదాపై తొలుత సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేస్తారు. అనంతరం మంత్రివర్గం భేటీ అయి.. ఆరు గ్యాంరటీలకి ఆమోదం తెలుపుతుంది. అర్హులకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేసిన తర్వాత, ఆ గ్యారంటీలకు ఎంత వ్యయమవుతుందన్న విషయంలో మరింత స్పష్టత వస్తుంది. గ్యారంటీ(Six Guarantees)లకు చట్టరూపం కల్పిస్తే వాటి అమలును ప్రశ్నించే హక్కు ప్రజలకు లభిస్తుంది. రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న వేళ ఆ గ్యారంటీల సింహావలోకనం.
మరికొద్ది గంటల్లో సీఎంగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం- అందరూ ఆహ్వానితులే
Telangana Congress Six Guarantees 2023 : మరోవైపు గ్యారెంటీల అమలుకు సంబంధించిన దస్త్రాలను సిద్ధం చేసినట్లు సమాచారం. ఆరు గ్యారెంటీలు మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, యువ వికాసం, చేయూతకు సంబంధించి ఒక దస్త్రాన్ని రూపొందినట్లు తెలిసింది. ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్‌కు సంబంధించిన మరో దస్త్రాన్ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. అలాగే అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ నోటిఫికేషన్(DSC Notification) ఉంటుందని కూడా ప్రచార సమయంలో రేవంత్ ప్రకటించారు. మరి ఇవాళ వీటిపై ముఖ్యమంత్రి సంతకాలు చేస్తారని తెలుస్తోంది.
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన 6 గ్యారెంటీలు వివరాలు :
1. మహాలక్ష్మి పథకం : రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నెరవేర్చేలా ఆరు గ్యారెంటీలు ఇస్తున్నట్లు సోనియా గాంధీ ప్రకటించారు. మహిళలను దృష్టిలో పెట్టుకొని మొదటి గ్యారెంటీగా సోనియా మహాలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టారు. రాష్ట్రంలో మహిళలకు నెలకు రూ.2500 చొప్పున అందజేయనున్నట్లు పేర్కొన్నారు. అదేవిధంగా ఉచిత ఆర్టీసీ బస్సు ప్రయాణం కల్పిస్తామని చెప్పారు. రూ.500కు గ్యాస్ సిలిండర్ ఇస్తామన్నారు.
అయితే లబ్ధిదారులకు ఉండాల్సిన అర్హతలేంటి, ఎంతమంది మహిళలకు ఇస్తారనేది నిర్ణయించాల్సి ఉంది. ఈ పథకానికి ఏటా దాదాపు రూ.18 వేల కోట్ల వరకు వ్యయమవుతుందని అధికారుల ప్రాథమిక అంచనా వేశారు. రాష్ట్రంలో 1.20 కోట్ల మంది గ్యాస్ వినియోగదారులుండగా, అర్హతలు నిర్ణయించిన తర్వాత వారిలో రాయితీ ఎంతమందికి వర్తిస్తుందనే విషయం తెలుస్తుంది.
2. రైతు భరోసా పథకం : దేశానికి అన్నం పెట్టే అన్నదాతలు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తోంది. రైతుల ప్రాణాలను కాపాడుకునేందుకు, రైతన్న అభివృద్ధి కోసం ఈ పథకాన్ని తీసుకువచ్చిందని ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే రైతు భరోసా పథకం(Rythu Barosa) ప్రకటించారు. ఈ పథకం కింద ఎకరాకు రూ.15,000, పట్టా భూమి రైతులతో పాటు కౌలు రైతులకు రూ.15,000 రైతు భరోసా ఇవ్వనున్నట్లు తెలిపారు. భూమిలేని నిరుపేదలు, రైతు కూలీలకు ఏడాదికి రూ.12,000 చెల్లిస్తామని పేర్కొన్నారు. వరి పంటకు క్వింటాకు అదనంగా రూ.500 బోనస్ అందజేస్తామని వెల్లడించారు. కాగా, రైతుబంధు కింద మొదటి విడత నిధులు గత ప్రభుత్వం పంపిణీ చేసినందునా ఇప్పుడు రెండో విడత ఇవ్వాల్సి ఉంది. ఇచ్చిన హామీ ప్రకారం మొదట ఇచ్చిన రూ.5,000 కాకుండా మరో రూ.10,000 చొప్పున ఇవ్వాల్సి ఉంటుంది.
3. గృహజ్యోతి పథకం : ఈ పథకం కింద గృహ అవసరాలకు ప్రతి కుటుంబానికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్(Free Current) సరఫరా అందజేయనున్నారు.
4. ఇందిరమ్మ ఇళ్ల పథకం : ఈ పథకం కింద ఇల్లు లేని వారికి ఇంటి స్థలం, గృహ నిర్మాణానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ఇవ్వనున్నారు. తెలంగాణ కోసం పోరాడిన ఉద్యమకారులకు 250 చదరపు గజాల ఇంటిస్థలం కేటాయిస్తారు.
5. యువ వికాసం పథకం : యువవికాసం కింద కళాశాల విద్య పూర్తి చేసిన విద్యార్థులకు రూ.5 లక్షల విద్యా భరోసా కార్డు, అలాగే ప్రతి మండలంలో తెలంగాణ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఏర్పాటు చేయనున్నారు.
6. చేయూత పథకం : వితంతు మహిళలకు, చేనేత కార్మికులకు, వికలాంగులకు, బీడీ కార్మికులు, ఒంటరి మహిళలు, కల్లుగీత, చేనేత కార్మికులు, హెచ్‌ఐవీ, బోదకాలు బాధితులు, డయాలసిస్ చేయించుకుంటున్న వారికి, వృద్ధులకు ఆసరా పథకం కింద రూ.4,000 పింఛను అందజేయనున్నారు. మరోవైపు దళిత, గిరిజన బంధు కింద దళితులు, గిరిజనులకు రూ.12 లక్షల ఆర్థిక సాయం చేయనున్నారు. చేయూత పథకం కింద రూ.10 లక్షల ఆరోగ్యశ్రీ బీమా అందజేయనున్నారు.
తెలంగాణ కేబినెట్ కొత్త జట్టు - రేవంత్‌తో పాటు ప్రమాణస్వీకారం చేయనున్న మంత్రులు వీరే
నేడు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెబుతారా - తొలి సంతకం దేనిపై చేస్తారో?