Vikas raj on munugode bypoll తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తి రేకెత్తించిన మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ చెదురు మదురు ఘటనలు మినహా ప్రశాంతంగా ముగిసింది. నియోజకవర్గ వ్యాప్తంగా 119 కేంద్రాల్లోని 298 బూత్‌లలో సాయంత్రం 6గంటలకు పోలింగ్ ముగిసినప్పటికీ .. కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. దీంతో సాయంత్రం 6గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారు ఓటు హక్కు వినియోగించుకునేందుకు అవకాశం కల్పించినట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తెలిపారు. కొన్ని కేంద్రాల్లో రాత్రి 8, 9 వరకు పోలింగ్ జరిగిందని వికాస్‌రాజ్ చెప్పారు.
''నల్గొండలోని స్ట్రాంగ్‌రూమ్‌కు ఈవీఎంలు తరలిస్తారు. ఈ నెల 6న ఓట్ల లెక్కింపు ఉంటుంది. ఓట్ల లెక్కింపు సిబ్బందికి ఇప్పటికే శిక్షణ ఇచ్చాం. ఉపఎన్నిక సజావుగా జరిగేందుకు అన్ని చర్యలూ తీసుకున్నాం. స్థానికేతరులను ఎప్పటికప్పుడు బయటకు పంపించాం. ఇంకా పలు పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లు ఉన్నాయి. సాయంత్రం 6లోగా వచ్చిన వారికి స్లిప్పులు ఇచ్చాం.'' - వికాస్‌రాజ్, సీఈఓ
పోలింగ్ మొత్తం పూర్తయ్యేందుకు కొంత సమయం పడుతుందన్న వికాస్‌రాజ్.. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల బయట స్వల్ప ఘర్షణలు చోటుచేసుకున్నట్లు తెలిపారు. మునుగోడులో 3 చోట్ల ఈవీఎంలు, 4 వీవీప్యాట్‌లు మార్చారని స్పష్టం చేశారు. మునుగోడులో ఇప్పటివరకు 6,100 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రూ.8.27 కోట్ల నగదు, ఇతర వస్తువులు, మునుగోడులో 3.29 కిలోల బంగారం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
''మునుగోడులో ఇవాళ 98 ఫిర్యాదులు వచ్చాయి. స్థానికేతరుల గుర్తింపు కోసం అన్ని బృందాలూ పనిచేశాయి. ఇవాళ 70 మంది స్థానికేతరులను గుర్తించి బయటకు పంపాం. ఓట్ల లెక్కింపునకు ర్యాండమ్‌గా మైక్రో అబ్జర్వర్లు కేటాయించాం. అందరి సహకారంతో ఉపఎన్నిక పోలింగ్ ప్రశాంతంగా జరిపాం. సాయంత్రం 6లోగా వచ్చినవారికి ఓటేసేందుకు అనుమతి ఇచ్చాం.'' వికాస్ రాజ్ తెలిపారు.
ఇవీ చూడండి: