Local body mlc election: స్థానికసంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి నేటితో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిందని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ తెలిపారు. ఐదు జిల్లాల్లోని ఆరు స్థానాలకు 26 మంది పోటీలో ఉన్నారని... వచ్చే నెల 10న పోలింగ్ నిర్వహించనున్నట్లు సీఈఓ తెలిపారు. ఐదు ఉమ్మడి జిల్లాల్లోని 5,326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొవిడ్ నిబంధనలకు లోబడి పోలింగ్, ఎన్నికల ప్రక్రియ జరుగుతుందని అన్నారు. ఓటర్లకు క్యాంపులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని... క్యాంపు రాజకీయాలపై ఫిర్యాదులు వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పారు.
ఇక ఏకగ్రీవం అయిన జిల్లాల్లో ఎన్నిక ప్రవర్తనా నియమావళిని ఎత్తివేస్తున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి స్పష్టం చేశారు. మొత్తం 9 ఉమ్మడి జిల్లాలకు గాను 4 జిల్లాల్లో ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవమైనట్లు తెలిపారు. మిగిలిన చోట్ల ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించారు.
స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న జిల్లాల్లో పోలింగ్ నిర్వహణ కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. 5,326 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పోలింగ్‌కు సంబంధించి కొవిడ్ నిబంధనల ప్రకారం ఏర్పాట్లు చేస్తున్నాము. ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారిని హోటళ్లు, రిసార్ట్స్ వంటి చోట పెట్టి క్యాంపులు నిర్వహించడానికి వీలులేదు. అటువంటి ఫిర్యాదులు వస్తే బాధ్యులపై చర్యలు తీసుకుంటాము.
-- శశాంక్ గోయల్, రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి
డిసెంబర్ 10న పోలింగ్..
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల(Mlc Elections) నామినేషన్ల ఉపసంహరణ గడువు నేటితో ముగిసింది. 12 స్థానాలకు నోటిఫికేషన్ రాగా.. ఆరు ఏకగ్రీవమై తెరాస ఖాతాలో పడ్డాయి. మిగతా 6 స్థానాలకు డిసెంబర్ 10న పోలింగ్(polling) జరగనుంది. డిసెంబర్ 14న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఇదీ చూడండి: MLC Nominations in karimnagar: కరీంనగర్ ఎమ్మెల్సీ బరిలో 10 మంది అభ్యర్థులు