50వేల రూపాయల్లోపు పంట రుణాల మాఫీని ఈ నెల 15నుంచి... నెలాఖరు లోపు పూర్తి చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. రుణమాఫీ అంశంపై కేబినెట్లో చర్చ జరిగింది. రాష్ట్రంలో ఇప్పటివరకు పంటరుణ మాఫీకి సంబంధించిన వివరాలను ఆర్థికశాఖ మంత్రివర్గం ముందు ఉంచింది. కరోనా కారణంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై భారంతో ఇప్పటివరకు 25వేల వరకు ఉన్న రుణాలను మాత్రమే మాఫీ చేసినట్లు అధికారులు తెలిపారు. 50వేల వరకు ఉన్న రుణాల మాఫీని ఈ నెల 15 నుంచి నెలాఖరు వరకు పూర్తి చేయాలని కేబినెట్ ఆదేశించింది.
మంత్రివర్గం నిర్ణయంతో 6లక్షల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఆయా రైతుల ఖాతాల్లో మాఫీ మొత్తాన్ని ప్రభుత్వం జమ చేయనుంది. వ్యవసాయంపై చర్చించిన కేబినెట్... వర్షాలు, పంటలు, సాగునీటి లభ్యత, ఎరువులు, ఇతర వ్యవసాయ అంశాలపై సమీక్షించింది. పత్తిసాగుపై ప్రత్యేకంగా చర్చించిన మంత్రివర్గం... తెలంగాణ పత్తికి ఉన్న ప్రత్యేక డిమాండ్ వల్ల సాగును ఇంకా పెంచాలని నిర్ణయించింది. అందుకోసం రాష్ట్ర రైతాంగాన్ని సమాయత్తం చేయాలని, ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వ్యవసాయ అధికారులను మంత్రివర్గం ఆదేశించింది.
ఇదీ చూడండి: cabinet: కొవిడ్ పరీక్షలు పెంచండి.. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయండి: కేసీఆర్