సొంత ఆదాయాలపై పూర్తి ధీమాతో రాష్ట్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21) భారీ బడ్జెట్‌ను ప్రతిపాదించనుంది. ప్రాధాన్య పథకాలు, ఎన్నికల హామీలు, అభివృద్ధి లక్ష్యాలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రస్తుత బడ్జెట్ కంటే 15-16 శాతం పెంచి తీసుకురావాలని నిర్ణయించింది. రూ.1.56 లక్షల కోట్ల నుంచి రూ.1.59 లక్షల కోట్ల మధ్య బడ్జెట్‌ను ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం.
శాసనసభలో హరీశ్.. మండలిలో ప్రశాంత్
ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో శనివారం రాత్రి జరిగిన మంత్రిమండలి సమావేశం బడ్జెట్‌ను ఆమోదించింది. ఆదివారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి టి.హరీశ్‌రావు, శాసనమండలిలో రహదారులు, భవనాల శాఖ మంత్రి వి.ప్రశాంత్‌రెడ్డి బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు.
హామీలను పూర్తిస్థాయిలో అమలుకు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి అప్పట్లో రూ.1.46 లక్షల కోట్ల బడ్జెట్ ప్రతిపాదించారు. అందులో భూముల అమ్మకాల ద్వారా వచ్చే రాబడి అంచనాలు రూ.10 వేల కోట్లు మినహాయించి, బడ్జెట్‌ను రూ.1.36 లక్షల కోట్లుగానే ప్రభుత్వం పేర్కొంటోంది. 2020-21కి సుమారు రూ.1.70 లక్షల కోట్లతో బడ్జెట్‌ను రూపొందించే అంశంపై ఒక దశలో సమగ్ర పరిశీలన చేసినట్లు తెలిసింది. తెరాస ఎన్నికల హామీలను పూర్తిస్థాయిలో అమలు చేసేలా ఈ బడ్జెట్‌లో కేటాయింపులకు ప్రాధాన్యం ఇచ్చినట్లు సమాచారం.
పింఛన్లకు రూ.12 వేల కోట్ల పైనే
సంక్షేమం, వ్యవసాయానికి సింహభాగం నిధులు దక్కనున్నాయి. ప్రభుత్వ ప్రాధాన్య పథకాలకు కేటాయింపులు పెరగనున్నాయి. నిర్వహణ వ్యయం, లక్ష్యాల పూర్తిలో భాగంగా సాగు, తాగునీటి రంగాలకు కేటాయింపులు పెరగనున్నాయి. ఆసరా పింఛన్లకు వయోపరిమితిని 65 ఏళ్ల నుంచి 57 ఏళ్లకు తగ్గించనున్న నేపథ్యంలో లబ్ధిదారులు 7 లక్షల మంది పెరగనున్నారు. పింఛన్లకు రూ.12 వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తం ప్రతిపాదించారు.
రుణమాఫీకి రూ.6 వేల కోట్లు
రెండు పడక గదుల ఇళ్లను గతంలో 2.7 లక్షలు ప్రతిపాదించగా.. వచ్చే బడ్జెట్‌లో లక్ష ఇళ్లను కొత్తగా మంజూరు చేస్తున్నట్లు తెలిసింది. రుణమాఫీకి ప్రస్తుత బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు ప్రతిపాదించారు. ఈ మొత్తం వ్యయం కాలేదు. వచ్చే నాలుగేళ్లలో రైతు రుణమాఫీ పూర్తి చేసేలా తాజా బడ్జెట్‌లో రూ.6 వేల కోట్లు ప్రతిపాదించనున్నట్లు తెలిసింది. ఉద్యోగుల వేతన సవరణ కూడా వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే అమలు చేయాల్సి ఉంటుంది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతికి ప్రత్యేకంగా నిధుల కేటాయింపుపైనా ప్రభుత్వం దృష్టిసారించింది.
సాగునీటి రంగానికి పది వేల కోట్లు
సాగునీటి రంగానికి రూ.9-10 వేల కోట్లు కేటాయించనున్నట్లు తెలిసింది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుంచి తీసుకునే రుణం దీనికి అదనం. ప్రాజెక్టులకు తీసుకొచ్చే రుణాలకు మార్జిన్‌మనీ, వడ్డీల చెల్లింపు మొదలైన అవసరాలకు బడ్జెట్‌లోనే కేటాయింపులు చేయనున్నారు. ఈ రంగానికి 2018-19 వరకూ బడ్జెట్‌లో రూ.25 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 2019-20 నుంచి రుణాలను ఎక్కువగా ఖర్చు చేస్తోంది.
పన్ను రాబడులపై ఆశావహం
సొంత రాబడులను గణనీయంగా పెంచుకుని ముందుకు సాగాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆర్థిక క్రమశిక్షణ ద్వారా శాఖల్లో అనవసర వ్యయాలకు అడ్డుకట్ట వేయనుంది. వచ్చే ఏడాది పన్ను రాబడిపై ప్రభుత్వం విశ్వాసంతో ఉంది. జీఎస్టీ, అమ్మకం పన్నుతోపాటు పన్నేతర రాబడులపై దృష్టి సారించనుంది. బడ్జెట్ పరిధిలో రుణాల పరిమితిని పెంచుకునే అంశంపై ఆశావహ దృక్పథంతో ఉంది. స్థిరాస్తి రంగం వృద్ధి.. అనేక అంశాల్లో రాబడులు పెరిగేందుకు దోహదపడుతుందని గుర్తించి పన్ను రాబడుల అంచనాలను పెంచింది.
ఇవీ చూడండి : రెండో రోజు వాడీవేడిగా చర్చ.. ఆరుగురు కాంగ్రెస్ సభ్యుల సస్పెషన్