Telangana BJP Leaders Meeting At BJP National President JP Nadda House: రాష్ట్రానికి చెందిన బీజేపీ జాతీయ కార్యవర్గ నేతలు దిల్లీ చేరుకుని.. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేంద్రమంత్రులు అమిత్‌షా, కిషన్‌రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, ప్రణాళికలపై నేతలతో చర్చించనున్నట్లు తెలుస్తోంది. నేతల మధ్య నెలకొన్న వివాదాలపై కూడా ఈ సమావేశంలో కీలకంగా దృష్టిసారించనున్నట్లు సమాచారం.
ఈ సమావేశంలో తెలంగాణ బీజేపీ వ్యవహారాల ఇన్‌ఛార్జ్ తరుణ్‌చుగ్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఎంపీ లక్ష్మణ్, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్, బీజేపీ జాతీయ ఉపాధ్యాక్షురాలు డీకే అరుణ, ఎమ్మెల్యే ఈటల రాజేందర్, విజయశాంతి, వివేక్ పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో అనుసరించాల్సిన వ్యూహాలపై, ప్రణాళికలపై పూర్తిస్థాయిలో చర్చించనున్నట్లు సమాచారం. తెలంగాణ బీజేపీ నేతలకు వచ్చే ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా ఉండాలని అమిత్‌షా, జేపీ నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు. మొదట అమిత్‌షా నివాసంలో సమావేశం నిర్వహించడానికి ఏర్పాటు చేయగా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.
తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ పావులు: దక్షిణ భారతదేశంలో కర్ణాటక తర్వాత తెలంగాణలోనే బీజేపీకి అనుకూల పవనాలు వీస్తున్నట్లు అధిష్ఠానం బలంగా నమ్ముతుంది. అందుకు తగిన సమయం ఇదేనని.. ఇప్పటి నుంచి తెలంగాణలోని బీజేపీ నాయకులు బీఆర్‌ఎస్‌పై పోరుకు సిద్ధమవ్వాలని భావిస్తోంది. అయితే బీఆర్‌ఎస్‌పై పోరు సాగిస్తూనే.. అసలు తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం ఏం చేసిందో.. ఎన్ని నిధులు మంజూరు చేసిందో తెలియజేయాలని ఈ సమావేశంలో తెలియజేసే అవకాశం ఉంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు అధిష్ఠానం ముఖ్యనేతలను నేడు దిల్లీ పిలిపించుకొని సమావేశం నిర్వహిస్తుంది.
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బీజేపీ అధిష్ఠానం సీరియస్‌గా దృష్టిపెట్టి.. తెలంగాణలోని బీజేపీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసేందుకు ఈ సమావేశం నిర్వహించనుందని తెలుస్తోంది. తాజా పరిస్థితులపై కేంద్రమంత్రి అమిత్‌షా ఆరాతీయనున్నారనే సమాచారం. బీఆర్‌ఎస్ వ్యూహాలకు ఎలా ఎదురెళ్లాలి.. దిల్లీ మద్యం కుంభకోణం వల్ల ఆ పార్టీ జరిగే నష్టం ఏంటో అన్నవి ఈ సమావేశంలో మాట్లాడనున్నట్లు తెలుస్తోంది.
రాష్ట్రంలో బీజేపీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన 11వేల వీధి సభలు ఈరోజుతో ముగియనుండగా.. ఇలా అర్ధాంతరంగా ముఖ్య నేతలను హస్తినకు పిలవడంపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. రాష్ట్రంలో పార్లమెంట్ ప్రవాస్ యోజన, ప్రజా గోస-బీజేపీ భరోసా వంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. వచ్చే మార్చి నుంచి పోలీంగ్ బూత్ స్వశక్తికరణ్ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర బీజేపీ నేతలకు అధిష్ఠానం నుంచి పిలుపించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. బీఆర్‌ఎస్ చేసే విమర్శలను ఏవిధంగా తిప్పికొట్టాలో అమిత్‌షా, జేపీ నడ్డా దిశానిర్దేశం చేయనున్నారు.
ఇవీ చదవండి: