భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi sanjay) తలపెట్టిన ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ప్రారంభమైంది. మహిళలు బోనాలతో స్వాగతం పలికారు. పెద్ద ఎత్తున పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు. పోలీసుల పటిష్ఠ భద్రత నడుమ యాత్ర సాగుతోంది. షేక్ పేట్లో ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో బండి సంజయ్‌కు యాదవులు దున్నపోతుతో ఘన స్వాగతం పలికారు. దున్నపోతుపై కూర్చొని సంజయ్ అభివాదం చేశారు.
ఆఫీసు బెరర్లతో సమావేశం
తెరాస నియంత, అవినీతి, కుటుంబ పాలనను ప్రజల్లో ఎండగట్టేందుకు బండి సంజయ్ (Bandi sanjay) ప్రజా సంగ్రామ యాత్రకు శనివారం శ్రీకారం చుట్టారు. తొలిరోజు వర్షంలోనూ మెహిదీపట్నం వరకు 10 కిలోమీటర్ల యాత్ర పూర్తిచేశారు. రాత్రి మెహదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాలలో బస చేసిన బండి సంజయ్... ఉదయం పార్టీ కార్యాలయ ఆఫీస్ బెరర్లతో సమావేశమయ్యారు. ప్రజా సంగ్రామ యాత్ర నిర్వహణపై చర్చించారు. ఈ భేటీలో డీకే అరుణ, స్వామిగౌడ్, రఘునందన్ రావు, రాజాసింగ్, భాజపా ముఖ్య నేతలు పాల్గొన్నారు.
సాయంత్రం 4 గంటలకు సభ
భేటీ అనంతరం ప్రజా సంగ్రామ యాత్ర రెండో రోజు ప్రారంభమైంది. మెహదీపట్నం పుల్లారెడ్డి ఫార్మసీ కళాశాల నుంచి యాత్రను బండి సంజయ్ ప్రారంభించారు. మెహదీపట్నం, టోలిచౌక్, షేక్ పేట్, గోల్కొండ పోర్ట్, లంగర్ హౌస్ మీదుగా బాపూ ఘాట్ వరకు పాదయాత్ర సాగనుంది. షేక్‌పేట్‌లో మధ్యాహ్నం భోజనం చేయనున్నారు. సా.4 గం.కు గోల్కొండ కోటలో బండి సంజయ్ బహిరంగ సభ నిర్వహించనున్నారు. గోల్కొండ మీదుగా లంగర్ హౌస్, బాపూ ఘాట్ వరకు యాత్ర సాగనుంది. రాత్రి బాపూ ఘాట్ వద్ద బండి సంజయ్ బస చేయనున్నారు.
యాత్రపై అమిత్ షా ఆశ్చర్యం
పాతబస్తీలో బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర విజయవంతంగా నిర్వహించినందుకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా (Amith Sha) అభినందనలు తెలిపారు. చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం వద్ద సభ నిర్వహించడంపై అమిత్ షా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. బండి సంజయ్ (Bandi sanjay) చేపట్టి మహా సంగ్రామ యాత్రపై అమిత్ షా ఆరా తీశారు. పాతబస్తీ సభపై అమిత్ షాకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ తరుత్ చుగ్, జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్‌సింగ్ నివేదిక అందజేశారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారం సందర్భంగా చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయలో అమిత్ షా పూజలు నిర్వహించారు.
ఇదీ చదవండి : భాజపా కార్యాలయ బేరర్లతో బండి సంజయ్ భేటీ...