Telangana Assembly Elections Campaigns 2023 : రాష్ట్రంలో పోలింగ్‌కు సమయం దగ్గరపడుతోన్న కొద్దీ.. అభ్యర్థులు ప్రచారాలను హోరెత్తిస్తున్నారు. ప్రత్యర్థులపై మాటల తూటాలతో విరుచుకుపడుతున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ రాజకీయం రోజురోజుకూ మరింత వేడెక్కుతోంది. ప్రచారంలో భాగంగా ప్రతిపక్ష నేతలపై ఆరోపణలు చేసే క్రమంలో పలువురు నోరు జారుతున్నారు. కొన్నిసార్లు రాయలేని భాషలో వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. అయితే ఇలా చేయడం ఎన్నికల నియమావళికి విరుద్ధం.
ఇలా ఎన్నికల నియమావళికి విరుద్ధంగా ఎవరైనా మాట్లాడితే.. కేసుల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది. నిబంధనలకు విరుద్ధంగా జరిగే ప్రచారాలు, వ్యక్తిగత దూషణలు, ఎన్నికల్లో జరిగే అక్రమాలు.. తదితర అంశాలపై ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చని ఎన్నికల సంఘం ఇప్పటికే స్పష్టం చేసింది. ఇందుకోసం సి-విజిల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. సామాన్య ప్రజల నుంచి నేతల నుంచి ఎవరైనా ఈ యాప్‌ను తమ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకుని కంప్లైంట్ చేసే అవకాశం కల్పించింది.
పది దాటిన తర్వాత ప్రసంగాలా - అయితే 'విజిల్'వేయడమే
ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి సి-విజిల్, ఇతర మార్గాల ద్వారా ఇప్పటి వరకు అన్ని పార్టీలకు సంబంధించి 25 వేల వరకు ఫిర్యాదులు వచ్చినట్లు తెలుస్తోంది. ఇందులో హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల నుంచే దాదాపు 10 వేల వరకు ఫిర్యాదులు అందినట్లు సమాచారం. ఇప్పటికే నామినేషన్ల ఘట్టం ముగిసి.. చివరి అంకానికి చేరువలో ఉన్న నేపథ్యంలో ఈ నెల 28 వరకు అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారాలు నిర్వహించే అవకాశం ఉంది. దీంతో ఫిర్యాదులు రెట్టింపు అయ్యే పరిస్థితులు లేకపోలేదు. దీనిని దృష్టిలో ఉంచుకుని నేతలు దూషణలకు దిగకుండా.. భావోద్వేగాలు రెచ్చగొట్టకుండా ప్రచారాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అభ్యర్థులు ఇలా చేయొద్దు సుమీ..:
- అభ్యర్థులు తమ ప్రచారాల్లో భాగంగా కులాలు, మతాలు, జాతుల మధ్య భాషాపరమైన లేక మతపరమైన ఉద్రేకాలు సృష్టించేలా ప్రసంగించకూడదు. అభ్యర్థుల కుటుంబసభ్యులను అవమానపరిచేలా మాట్లాడటం, వారి వ్యక్తిగత జీవితాల గురించి ఆరోపించడం, అనవసర వక్రీకరణలు చేయడం సరికాదు. ఇలా చేయడం ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధం.
- ప్రత్యర్థుల ఇంటి ముందు వ్యతిరేక ప్రదర్శనలు చేయడం, వారితో బాహాబాహీకి దిగడం.. అనుచరులతో వారి ఇంటి ముందే తిష్ఠ వేసి ఇబ్బందిపెట్టేలా ప్రవర్తించడం లాంటి చర్యలు చేయకూడదు. అవతలి వ్యక్తి అనుమతి లేకుండా వారి ఇంటి గోడలపై జెండాలు అంటించడం, తమకు అనుకూలంగా రాతలు రాయడం, ఇళ్లపై జెండాలు పాతడం లాంటి చర్యలు చేయకూడదు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలు నిర్వహించిన సమావేశాలకు అడ్డంకులు కలిగించడం, వాటిని అడ్డుకోవడం లాంటివి అభ్యర్థులు చేయకూడదు. ఇవన్నీ నియమావళి ఉల్లంఘన కిందకే వస్తాయని గుర్తుంచుకోవాలి.
- ఓటర్లనే కాకుండా ప్రత్యర్థి పార్టీలను ప్రలోభపెట్టడం.. తమకు అనుకూలంగా ఓటు వేయకపోతే సంగతి చూస్తామని దాడులకు దిగడం, బెదిరించడం నేరమని గుర్తుంచుకోవాలి. అసలు ఓటర్లకు బదులు.. వేరే ఓటర్లను తీసుకొచ్చి ఓట్లు వేయించే ప్రయత్నాలు చేయడమూ నేరంగా పరిగణిస్తారని గుర్తుంచుకుని నడుచుకోవాలి.
ఓటర్లను ప్రలోభ పెట్టేవి తప్ప ఇతర సామాగ్రి సీజ్ చేయొద్దు : సీఈసీ