హైదరాబాద్ అమీర్పేట మైత్రీవనంలో టెక్నికల్ వినాయకుడు కొలువుదీరాడు. కంప్యూటర్ సాంకేతికతలో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పాడైన కంప్యూటర్ విడిభాగాలతో వినూత్నంగా గణనాథుడిని రూపొందించారు. స్థానికంగా ఉన్న హార్డ్వేర్ సాప్ట్వేర్ టెక్నికల్ ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు పర్యావరణాన్ని కాపాడాలనే ఉద్దేశంతో తమదైన శైలిలో వినాయక విగ్రహం తయారు చేశారు.
వీటితోనే రూపొందించారు..
నిరుపయోగంగా ఉన్న కంప్యూటర్ విడిభాగాలతో వినాయకుడి తయారుచేయాలనే ఆలోచనతో 20 రోజుల పాటు శ్రమించి పార్వతీ సుతుడి ప్రతిమను రూపొందించారు. 150 మౌస్లు, 60 కీబోర్డులు, రెండు మథర్బోర్డులు, 8 ల్యాండ్ టెస్టర్లు, ల్యాప్‌ట్యాప్, మూడు సీపీయూలు, రెండు హార్డ్ డిస్క్‌లు ఉపయోగించి వినాయకుడిని రూపొందించారు.
తొమ్మిదేళ్లుగా వినాయకుడి ఉత్సవాలు చేస్తున్నామని ఈసారి వినూత్నంగా, పర్యావరణ హితంగా గణేషుడిని తయారుచేయాలనే ఉద్దేశంతో టెక్నికల్ గణేషుడిని తయారు చేశామంటున్నారు విద్యార్థులు. ఆలోచనకు సాంకేతిక జోడించి.. దానిని బాధ్యతతో నెరవేర్చి భక్తిని చాటుకున్నారు విద్యార్థులు.
ఇదీ చూడండి: అటు 'యాపిల్' గణేశుడు.. ఇటు 'బాదం' గణనాథుడు