Supreme Court Recommend Justice Alok Aradhe : తెలంగాణ హైకోర్టుకు కొత్త ప్రధాన న్యాయమూర్తి రాబోతున్నారు. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానానికి కొత్త సీజేగా జస్టిస్ అలోక్ అరధే నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను.. పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేసిన కొలీజియం.. ఆయన స్థానంలో జస్టిస్ అలోక్ పేరును సిఫారసు చేసింది.
జస్టిస్ అలోక్ అరధే ప్రస్థానమిది..: రాయ్‌పూర్‌లో 1964 ఏప్రిల్ 13న జన్మించిన జస్టిస్ అలోక్... 1988 జులై 12న న్యాయవాదిగా ప్రస్థానం ప్రారంభించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా 2009 డిసెంబర్ 29న నియమితులయ్యారు. జమ్ముకశ్మీర్ హైకోర్టు న్యాయమూర్తిగా 2016 సెప్టెంబరు 16న బదిలీ అయిన జస్టిస్ అలోక్ అరధే... ఆ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీకి, లీగల్ సర్వీసెస్ అథారిటీకి ఛైర్మన్‌గా చేశారు. జస్టిస్ అలోక్ అరధే 2018లో మూడు నెలల పాటు జమ్ముకశ్మీర్ తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తిగానూ వ్యవహరించారు. కర్ణాటక హైకోర్టు జడ్జిగా 2018 నవంబరు 17 నుంచి కొనసాగుతున్న జస్టిస్ అలోక్... కొంతకాలం కర్ణాటక తాత్కాలిక సీజేగా చేశారు.
సుప్రీం న్యాయమూర్తులుగా వారికి పదోన్నతి : రాష్ట్ర హైకోర్టు ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భూయాన్‌ను పదోన్నతిపై సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా నియమించడానికి కొలీజియం సిఫార్సు చేసింది. కేరళ హైకోర్టు సీజే జస్టిస్ వెంకట నారాయణ భట్టిని కూడా... సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా కొలిజియం సిఫార్సు చేసింది. వీటికి కేంద్ర ప్రభుత్వ ఆమోదం లభిస్తే.. వారు సుప్రీంకోర్టు న్యాయమూర్తులుగా పదోన్నతులు పొందనున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ కిషన్‌కౌల్, జస్టిస్ సంజీవ్‌ఖన్నా, జస్టిస్ బీఆర్ గవాయ్, జస్టిస్ సూర్యకాంత్‌లతో కూడిన కొలిజియం బుధవారం ఈమేరకు సిఫార్సు చేసింది.
జస్టిస్ ఉజ్జల్ భూయాన్: జస్టిస్ ఉజ్జల్ భూయాన్ 2011 అక్టోబర్ 17న గువాహటి హైకోర్టు జడ్జ్‌గా నియమితులయ్యారు. ఆ హైకోర్టు నేపథ్యం ఉన్న న్యాయమూర్తుల్లో అత్యంత సీనియర్‌గా ఆయన ఉన్నారు. 2022 జూన్ 28 నుంచి తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తున్నారు. హైకోర్టు న్యాయమూర్తిగా సుదీర్ఘకాలం సేవలు అందించిన జస్టిస్ భూయాన్ న్యాయరంగానికి సంబంధించిన విభిన్న అంశాలపై విశేష అనుభవం సంపాదించారు.
జస్టిస్ వెంకటనారాయణ భట్: జస్టిస్ వెంకటనారాయణ భట్ 2013 ఏప్రిల్ 12న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ హైకోర్టు నేపథ్యం ఉన్న వారిలో ఆయన అత్యంత సీనియర్ న్యాయమూర్తి. 2022 ఆగస్టు నుంచి (జస్టిస్ ఎన్పీ రమణ పదవీ విరమణ అనంతరం) ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు సుప్రీంకోర్టులో ప్రాతినిధ్యం లేదు. 2019లో మార్చిలో జస్టిస్ భట్ కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. 2023 జూన్ 1 నుంచి ఆ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలందిస్తూ వస్తున్నారు.
ఇవీ చదవండి :