సివిల్ జడ్జి పరీక్ష రాయాలంటే అడ్వకేట్‌గా కనీసం మూడేళ్లు ప్రాక్టీస్ చేసి ఉండాలన్న షరతును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేసింది. ఏపీ ప్రభుత్వ స్పందన కోరుతూ నోటీసులు జారీచేసింది. ఆంధ్రప్రదేశ్ స్టేట్ జ్యుడిషియల్ సర్వీస్ రూల్స్ 2007 5(2)(ఎ)(ఐ)ని సవాల్ చేస్తూ రేగలగడ్డ వెంకటేష్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ అనిరుద్ధబోస్‌లతో కూడిన సెలవుకాల ధర్మాసనం బుధవారం విచారించింది.
నిబంధనలపై స్టే ఇవ్వడానికి నిరాకరిస్తూ, ఏపీ ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. దీనిపై సెలవుకాల ధర్మాసనాన్ని ఆశ్రయించాల్సిన అత్యవసరం ఏముందని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ప్రశ్నించింది. అందుకు ఆయన స్పందిస్తూ సివిల్ జడ్జి పోస్టులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి జనవరి 2 చివరి తేదీ అని, అందుకే విధిలేని పరిస్థితుల్లో సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించాల్సి వచ్చిందని పేర్కొన్నారు. కనీసం దరఖాస్తు చేసుకోవడానికి అనుమతించాలని కోరారు. అయితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరిస్తూ, ఆ రాష్ట్ర ప్రభుత్వ స్పందన కోరుతూ నోటీసులు జారీచేసింది. ఈ కేసు తదుపరి విచారణను జనవరి 5కి వాయిదా వేసింది.
- ఇదీ చదవండి: ఆరోగ్య శ్రీపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం