సాత్విక రూపంలో దర్శనమిస్తూ సకల శుభాలనూ కలిగించే ఈ మహాలక్ష్మీదేవి ఆలయానికి 800 ఏళ్ల చరిత్ర ఉందనీ... దీన్ని కాకతీయుల కాలంలో నిర్మించారనీ చెబుతారు. పెద్దపల్లి జిల్లాలోని మంథని పట్టణంలో గోదావరి నదికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఆలయాన్ని దర్శించుకునేందుకు దేశవిదేశాల నుంచీ భక్తులు వస్తారని ప్రతీతి. మన దేశంలో మహాలక్ష్మి స్వయంభువుగా వెలసిన క్షేత్రాలు అరుదు. వాటిల్లో ఒకటి కొల్హాపూర్‌లోనూ మరొకటి విశాఖపట్నంలోనూ ఉంటే... వాటి తరువాత ఈ క్షేత్రంపేరే వినిపిస్తుంది. ఎంతో మహిమాన్వితమైన ఈ ఆలయం వెనుక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.
స్థలపురాణం
ఈ ఆలయానికి వెనుక భాగంలో అత్యంత ప్రాచీనమైన ఓ తామరకొలను ఉంది. ఆ తామరపూల మధ్యలోనే అమ్మవారు స్వయంభువుగా వెలిసిందని చెబుతుంటారు. అయితే ఆ విషయం ఎవరికీ తెలియకపోవడంతో ఓ సారి అమ్మవారే తన ఉనికి గురించి మంథనికి చెందిన ఓ వేద పండితుడికి కలలో కనిపించి చెప్పిందట. తనను వెలికితీసి ఓ ఆలయాన్ని కట్టించి నిత్యం ధూప దీప నైవేద్యాలతో పూజలు చేయమని కోరిందట. అమ్మవారు చెప్పినట్లుగా తామర కొలనులో ఉన్న విగ్రహాన్ని బయటకు తీసిన ఆ భక్తుడు తరువాత స్థానికుల సాయంతో గుడి నిర్మించినట్లు చెబుతారు. అమ్మవారు తామర కొలనులోనే దొరికింది కాబట్టి ప్రతిరోజూ అక్కడి నుంచి ఓ పువ్వును తీసుకొచ్చి దేవికి అర్పించడం ఓ ఆనవాయితీగా వస్తోంది. ఈ క్షేత్రంలో అమ్మ ఓ చేత్తో కుంకుమభరిణ, మరో చేత్తో ఖడ్గం, ఇంకోచేత్తో అక్షయపాత్రను ధరించి... సిరిసంపదలను అందిస్తుందని అంటారు.
సూర్యకిరణాలతో దర్శనం
సూర్యోదయ సమయంలో ప్రతిరోజూ సూర్య కిరణాలు అమ్మవారి పాదాల నుంచి శిరస్సు వరకు చేరుకుంటాయి. ఆ సమయంలో దేవిని దర్శించుకుంటే కోరిన కోరికలు నెరవేరతాయని స్థానికుల నమ్మకం. అదేవిధంగా ఈ ఆలయం చుట్టూ 16 ప్రదక్షిణలు చేసి కొబ్బరికాయను ముడుపుగా సమర్పిస్తే అమ్మ అనుగ్రహం లభిస్తుందని అంటారు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లోని చాలామంది భక్తులు తమ ఇళ్లల్లో ఏదైనా శుభకార్యాన్ని ప్రారంభించే ముందు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకోవడాన్ని ఓ సంప్రదాయంగా పాటిస్తారు. నిత్యపూజలతోపాటూ శరన్నవరాత్రుల మొదటి రోజు నుంచీ దసరా వరకూ ఇరవైనాలుగ్గంటలూ అఖండ నామ సంకీర్తన, సామూహిక కుంకుమార్చనలు ఇక్కడ విశేషంగా జరుగుతాయి. ఆ సమయంలో నాదబ్రహ్మ సప్తాహ దీక్ష పేరుతో నిరంతరంగా భగవన్నామ స్మరణను నిర్వహిస్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో దుర్గాదేవి సన్నిధానంతోపాటూ చుట్టుపక్కల సరస్వతి, మహాశివుడు, గౌతమేశ్వరుడు, సుందిళ్ల లక్ష్మీనరసింహస్వామి, ఆదివరాహస్వామి ఆలయాలను కూడా దర్శించుకోవచ్చు.
ఎలా చేరుకోవచ్చు
హైదరాబాద్ నుంచి మంథని పట్టణానికి 230 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా వరంగల్‌నుంచి మంథనికి 104 కిలోమీటర్లు ఉంటుంది. ఈ రెండు ప్రాంతాల నుంచి మంథని డిపోకు ప్రత్యేక బస్సులు ఉంటాయి. మంథని డిపో నుంచి ఆలయం చేరుకునేందుకు ప్రయివేటు వాహనాలు ఉంటాయి.