తెలంగాణలో భానుడు చెలరేగిపోతున్నాడు. రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది. రోజురోజుకూ వేడి గాలుల తీవ్రత పెరుగుతోంది. ఖమ్మం, రామగుండం లాంటి ప్రాంతాల్లో ఇప్పటికే గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీలు దాటింది. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, నల్గొండ, ఆదిలాబాద్, నిజామాబాద్ తదితర ప్రాంతాల్లో 45 డిగ్రీలు నమోదు అవుతున్నది. వాతావరణ శాఖ నిబంధనల ప్రకారం 45 డిగ్రీల ఉష్ణోగ్రత దాటిందంటే.. ఎండ తీవ్రత ప్రమాదకరంగా మారిందని అర్థం. వడదెబ్బ తాకిడికి నల్గొండలో ఒకేరోజు ఏడుగురు మృత్యువాత పడడం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది. ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది.
ఎండ తీవ్రత ఎక్కవగా ఉండే ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకూ బయటకు వెళ్లకపోడవమే మంచిదని అధికారులు చెబుతున్నారు. బాగా ముదురు రంగు దుస్తులు ధరించకుండా.. వదులుగా ఉండే నూలు, తెలుపు, లేత రంగు దుస్తులు ధరించాలని సూచిస్తున్నారు. ఎండవేడిలో ఎక్కువసేపు పని చేసేటపుడు.. మధ్య మధ్యలో చల్లని ప్రదేశంలో సేద తీరాలంటున్నారు. ఎక్కడ ఉన్నా నీళ్లు అధిక మొత్తంలో తీసుకోవాలని చెప్తున్నారు.