మండుటెండలో లక్ష్యం వైపు పరుగెడుతున్న మహిళ పేరు సుఫియా. రాజస్థాన్‌లోని అజ్‌మేర్‌లో సుఫియా పుట్టి పెరిగింది. డిగ్రీ వరకూ చదివిన సుఫియా.. తర్వాత పదేళ్లపాటు ఓ ప్రైవేటు విమానయాన సంస్థలో పనిచేశారు. ఫిట్‌నెస్‌కు అత్యంత ప్రాధాన్యమిచ్చే ఆమె.. అందుకు పరుగుని మార్గంగా ఎంచుకున్నారు. క్రమంగా పరుగుపై మమకారం పెంచుకున్నారు. తర్వాత పరుగే ఆమె ఆశ, శ్వాసగా మారింది. ప్రస్తుతం మిషన్ ఫర్ హోప్ పేరిట దేశవ్యాప్త పరుగు చేపట్టారు. గతేడాది డిసెంబర్ 16న దిల్లీలో ఈ పరుగును ప్రారంభించారు. 135 రోజుల్లోనే 6వేల కిలోమీటర్లు పయనించి.. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలైన ముంబై, చెన్నై నగరాలను చుట్టి తిరిగి దిల్లీలో అడుగుపెట్టాలనేది సుఫియా సంకల్పం.
స్వర్ణ చతుర్భుజిగా పిలుచుకునే జాతీయ రహదారులపై ఆమె పరుగు తీస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని ప్రాంతమైన గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సుఫియా పరుగు సాగుతోంది. 'మిషన్ ఫర్ హోప్' పేరుతో చేస్తున్న ఈ పరుగు ద్వారా శాంతి, సమానత్వం, మానవత్వం అనే సందేశాల్ని ప్రజలకు చేరవేస్తున్నారు సుఫియా. సమానత్వ భావన లేకపోవటం వల్ల జరుగుతున్న ఘటనలు, మానవత్వం లేకుండా కొందరు ప్రవర్తిస్తున్న తీరు ఇవన్నీ సమాజానికి, దేశానికి మంచిది కాదనేది సుఫియా అభిప్రాయం. వీటన్నింటి నుంచి బయటపడి రేపు బాగుంటుందనే ఆశతో ముందుకెళ్లాలని సూచిస్తున్నారు.
'ఎక్కువ మందిని కలవడమే ఈ మిషన్ ఉద్దేశం. నా పరుగు ద్వారా ప్రతి ఒక్కరికి శాంతి, మానవత్వంపై మంచి సందేశం ఇవ్వడమే లక్ష్యం. ఎందుకంటే దేశంలో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలియాల్సిన బాధ్యత ఉంది. ఒకరికొకరు గౌరవించుకోవాలి. అందుకే ఈ సందేశాన్ని దేశమంతా విస్తరిస్తాం.' - సుఫియా, రన్నర్
135 రోజుల్లో 6వేల కిలోమీటర్లు.. దేశాన్ని చుట్టిరావడమే లక్ష్యం
సుఫియా తన పరుగుని గిన్నిస్ రికార్డు కోసం పంపించనున్నారు. గతంలో 2019లో కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ 4వేల కిలోమీటర్లు పరుగు చేపట్టి గిన్నిస్ రికార్డు సాధించారు. ఇప్పుడు 6వేల కిలోమీటర్ల పరుగుతో తన రికార్డును తానే అధిగమించేందుకు యత్నిస్తున్నారు. ఈ పరుగులో సుఫియా భర్త వికాస్ ఆమె వెంట వాహనంలో అనుసరిస్తుంటారు. ప్రతి పురుషుడి విజయం వెనుక స్త్రీ ఉంటుందనే సామెతకు భిన్నంగా సుఫియా పరుగుకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారు ఆమె భర్త. గార్మర్, రాజీవ్ గాంధీ ఫౌండేషన్ తో పాటు క్రౌడ్ ఫండిగ్ ద్వారా ఈ కార్యక్రమానికి నిధులు సమీకరించుకుంటున్నారు.
'నేను మార్గమధ్యలో చాలా మందిని కలుస్తున్నాను. ప్రతి ఒక్కరు నాకు అండగా నిలబడుతున్నారు. నాతో పాటు పరిగెడుతున్నారు. చాలా ఆనందంగా ఉంది.'
- సుఫియా, రన్నర్
దేశంలోని ప్రముఖ నగరాలను చుట్టేస్తున్న సుఫియా పరుగు ఏప్రిల్ మొదటి వారంలో దిల్లీ ముగియనుంది.
ఇదీ చదవండి: రాయలసీమ ఎత్తిపోతల పనులు చేపట్టొద్దు : ఎన్జీటీ