Students Suffering: రాష్ట్రంలోనే కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే ఆదిలాబాద్ జిల్లాలో ఆశ్రమ పాఠశాలలు, గురుకులాల్లో తలదాచుకుంటున్న విద్యార్థులు చలి తీవ్రతకు గజగజలాడుతున్నారు. ఏటా శీతాకాలంలో ఐటీడీఏ అధికారులు వీరికి ఉన్నిదుస్తులు అందించేవారు. ఈసారి కనీసం మందపాటి దుప్పట్లయినా సమకూర్చలేదు. పలచటి దుప్పట్లు రెండివ్వగా, వాటిలోనే పిల్లలు ముడుచుకుని పడుకుంటున్నారు. తెల్లారితే వీరికి మరో నరకం.. చన్నీళ్ల స్నానం. సోలార్ వాటర్ హీటర్లున్నా అలంకారప్రాయంగానే మిగిలాయి. రాష్ట్రంలో 326 గిరిజన ఆశ్రమ వసతిగృహాలు ఉన్నాయి. వీటిలో మూడు నుంచి పదో తరగతి వరకు చదివే 87,933 మంది విద్యార్థులు ఉంటున్నారు. అయిదేళ్ల కిందట 2016లో అందించిన పరుపులు చిరిగిపోయాయి. మరో దారిలేక వాటిపైనే విద్యార్థులు నిద్రిస్తున్నారు. ఉన్న దుప్పట్లను ఇద్దరు ముగ్గురు విద్యార్థులు కలసి కప్పుకొంటున్నారు. చలి తీవ్రతకు చిన్నారులు న్యుమోనియా, జ్వరాల బారిన పడుతున్నారు.
పనిచేయని సోలార్ వాటర్ హీటర్లు..
ప్రతి గిరిజన ఆశ్రమ వసతిగృహంలో అధికారులు సౌరశక్తితో నడిచే వాటర్ హీటర్లు ఏర్పాటుచేశారు. ఒక్కో సోలార్ పలక కోసం రూ.70వేల వంతున వెచ్చించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఒక్కో యూనిట్ (4-5 పలకలు)కు రూ.2లక్షల నుంచి రూ.3లక్షల వరకు ఖర్చుచేశారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని వసతిగృహాల్లో ఇవి ఉన్నా, లాక్‌డౌన్ కారణంగా ఉపయోగించక ఎక్కడా పనిచేయడం లేదు. కొన్నిచోట్ల సోలార్ పలకలు విరిగిపోయాయి. గత్యంతరం లేక చలిలోనూ పిల్లలు చన్నీటి స్నానం చేస్తున్నారు.
కుమురంభీం జిల్లా సిర్పూర్(యు) మండలం మహాగావ్ గిరిజన బాలికల హాస్టల్‌లో అయిదు నుంచి పదో తరగతి వరకు చదివే 260 మంది విద్యార్థినులు ఉన్నారు. ఇక్కడ ఏర్పాటు చేసిన సోలార్ వాటర్ హీటర్లు పనిచేయక నిత్యం చన్నీళ్లతోనే స్నానం చేస్తున్నారు. ఈ మండలంలో రాష్ట్రంలోనే అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
కుమురంభీం జిల్లా తిర్యాణి మండలం పంగిడిమాదర వసతిగృహంలోనూ సోలార్ వాటర్ హీటర్ పనిచేయడం లేదు. బావినీటితోనే విద్యార్థులు స్నానాలు చేస్తున్నారు. తాగునీటి కోసం గ్రామంలోని చేతిపంపు వద్దకు వెళ్తున్నారు.
ఇదీ చూడండి: Temperatures dropped: గజగజ వణుకుతున్న తెలంగాణ.. నాలుగైదు రోజుల్లో మరింతగా!