ఓ వైపు కళాశాల యాజమాన్యాలు... మరోవైపు తల్లిదండ్రుల ఒత్తిడి... ఏదైతేనేం బలి అయ్యేది మాత్రం టీనేజీ విద్యార్థులు. ఉత్తీర్ణత సాధించకపోతే.. ఎందుకు పనికిరానట్టుగా సమాజం చూస్తోందని భయానికి గురై చిన్నారులు చితికిపోతున్నారు. పరీక్షల్లో ఫెయిల్ అయితే... ఇక జీవితం దండగే అనుకుంటున్నారు. పరీక్షలు ప్రతి సంవత్సరం వస్తాయి... కానీ జీవితం ఒక్కసారి కొల్పోతే మళ్లీ తిరిగిరాదనే విషయాన్ని గ్రహించాలి.
అసలు ఎందుకిలా ఆలోచిస్తున్నారు?
పరీక్షల్లో తప్పితే.. ముందు ఇంట్లో వాళ్లు ఏం అంటారోనని భయం... అంతేనా బంధువులు, ఇంటి పక్కనవారు, స్నేహితులు చులకనగా చూస్తారని ఆందోళనకు గురవుతారు. అందుకే పరీక్షల్లో తప్పితే... ప్రాణాల్ని విడిచేందుకు వెనకాడడం లేదు.
తల్లిదండ్రులు ఏం చేయాలి?
మీ పిల్లల్ని మార్కుల కోసం కాకుండా విజ్ఞానం కోసం చదివించండి. పరీక్షలు తప్పితే... ప్రోత్సహించాలి తప్ప... వారిని మందలించకండి. మార్చి పోతే సెప్టెంబర్ ఉంటుందనే విషయాన్ని చెప్పండి. వాళ్లు ఇష్టంగా చదవడానికి మీరు ప్రేమగా చెప్పండి. వాళ్లు బాధపడితే ఓదార్చండి... ఏ సమస్య ఎదురైనా ఎదుర్కునేలా వారిలో ధైర్యాన్ని పెంచండి.
విద్యార్థులు గమనించాల్సింది!
పరీక్షలు తప్పినంత మాత్రన... ఎందుకు పనికిరాని వ్యక్తిగా భావించకండి. ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లాలి తప్ప.. నిరాశ చెందకూడదు. ఈ పరీక్షలు తప్పినంతమాత్రాన జీవితం కోల్పోయినట్లు కాదని గుర్తించండి. గొప్పవారిలో అనేకమంది పరీక్షలు తప్పినవారు కూడా ఉన్నారని గుర్తు పెట్టుకోండి.
ఇదీ చూడండి: ఇంటర్లో ఫెయిల్... విద్యార్థిని సూసైడ్..