ఎవరికైనా లక్ష్యం ఉంటే సరిపోదు.. సాధించే పట్టుదల, అందుకు కావాల్సిన శ్రమ కావాలి. సుదీర్ఘ ప్రయాణంలో ఓటములు ఎదురైనా... ముందుకు సాగే ఆత్మవిశ్వాసం ఉండాలి. అప్పుడే విజయతీరాలకు చేరుకోవచ్చంటోంది హైదరాబాద్ ఎర్రమంజిల్‌కు చెందిన శ్రీవల్లి రష్మిక. చిన్నతనంలో సరదాగా టెన్నిస్ రాకెట్ పట్టింది శ్రీవల్లి. అనుకోకుండానే ఆటపై మక్కువ పెంచుకుంది. నిరంతర సాధనతో అంచెలంచెలుగా ఎదిగి జాతీయ సీనియర్ ఛాంపియన్ స్థాయికి చేరుకుంది. ఈ క్రమంలో ఆమె శ్రమ, లక్ష్యం చేరుకోవడానికి శ్రమిస్తున్న విధానం ఎంతో మందికి ఆదర్శంగా నిలుపుతోంది.
తన ఆసక్తిని గమనించి తల్లిదండ్రులు కూడా ఆ దిశగా ప్రోత్సహం అందించారు. వారి నమ్మకాన్ని నిలబెడుతూ వివిధ టోర్నీల్లో సత్తా చాటింది శ్రీవల్లి రష్మిక. ఇటీవల హరియాణాలో జరిగిన జాతీయ ఛాంపియన్‌షిప్‌లో-2020హార్డ్‌కోర్ట్ టైటిల్ సొంతం చేసుకుంది. ఇప్పటికే జూనియర్ క్లే, హార్డ్ కోర్ట్ జాతీయ ఛాంపియన్‌గా నిలిచిన రష్మిక.... సీనియర్ హార్డ్ కోర్ట్ జాతీయ ఛాంపియన్ షిప్ టైటిల్ సాధించి తనపై అంచనాల్ని మరింత పెంచేసింది. బలమైన ఫోర్‌హ్యాండ్, వేగవంతమైన సర్వీసులతో ప్రత్యర్థుల్ని చిత్తు చేస్తోంది.
వరస విజయాలతో ప్రతిభ చూపుతున్న ఈ యువ కెరటం.. అంతర్జాతీయ టోర్నీల్లో పతకాలే లక్ష్యంగా శ్రమిస్తోంది. ఈ ఏడాదిలో జరగనున్న ట్యూనీషియా, ఐరోపా టోర్నీల్లో సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది. దాంతో పాటే.. డబ్ల్యూటీఏ మహిళల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో మంచిస్థానం సంపాదించేందుకు రోజుకు 8 గంటలు కఠిన సాధన చేస్తోంది...రష్మిక.
బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్ కళాశాలలో బీకామ్ చదువుతున్న రష్మిక... చదువులోనూ తనకు తిరుగులేదని నిరూపిస్తోంది. విరామం లేని సాధన, కసరత్తులు మధ్య మంచి మార్కులు సాధిస్తోంది.అందరిలా సరదాగా గడపాలని ఉన్నా.... ఆట, చదువుల తీరికలేని షెడ్యూల్ కారణంగా కుదరదంటోంది శ్రీవల్లి. ఏదైనా సాధించాలంటే కొన్ని త్యాగాలు తప్పవని... అప్పుడే విజయం వరిస్తుందని చెబుతోంది.
శ్రీవల్లి ప్రస్తుతం ఆనంద్ అకాడమీలో సాధన చేస్తోంది. రష్మికలో మంచి నైపుణ్యం, పట్టుదల ఉన్నాయని...భవిష్యత్‌లో అంతర్జాతీయ స్థాయిలో ఉత్తమ క్రీడాకారిణిగా రాణిస్తుందనే నమ్మకం ఉందంటున్నాడు.. కోచ్ ఆనంద్. తల్లిదండ్రులు సైతం ఆమె ఆటతీరుపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అనుకున్నది సాధించడం సులువు కాదు. కానీ ప్రయత్నిస్తే అసాధ్యమూ కాదంటోంది... ఈ యువ క్రీడాకారిణి. అందుకే తన లక్ష్యం చేరుకునేందుకు ఎంతైనా శ్రమిస్తానంటోంది.
ఇవీచూడండి: రాష్ట్ర ఆవిర్భావం నుంచి ఐటీ రంగంలో దూసుకెళ్తున్నాం : కేటీఆర్