గ‘జల’ కళ!
‘నీటి సమస్య పరిష్కరించడానికొచ్చావా? దశాబ్దాలుగా ఎవరూ చెయ్యలేనిది నువ్వు చేస్తావా?’ కచ్ జిల్లాలోని రాపార్ తాలూకాలో గజాలా అడుగుపెట్టినప్పుడు అంతా గేలిచేస్తూ అన్న మాటలివి. మరికొందరైతే ఓట్లు అడగడానికి వచ్చిన వ్యక్తిగా కూడా ఆమెని అనుమానించారు. సోషల్ వర్క్‌లో పీజీ చేసి సమాజ సేవ చేయాలని తపించే గజాలాలో ఆ మాటలు మరింత పట్టుదల పెంచాయి. నిజానికీ, 2001లో ఆమె సమర్థ్ సంస్థని స్థాపించినప్పుడు కచ్‌లో తీవ్ర భూకంపం వచ్చింది. వందల మంది ప్రాణాలు కోల్పోయారు. పర్యావరణం కూడా బాగా దెబ్బతిని ఆ ప్రభావం వర్షపాతం, ఉష్ణోగ్రతల మీద పడింది. ఆ సమయంలో నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం కోసం దీర్ఘకాలిక వ్యూహంతో సమర్థ్ సంస్థ ఆ ప్రాంతంలోకి అడుగు పెట్టింది. స్థానికుల్లో నమ్మకం పెంచడంతోపాటు నీటి వనరుల గురించి అవగాహన కల్పించడానికి, నిధుల సమీకరణకు ఆమెకు దశాబ్ద కాలం పట్టింది.
తగ్గిన వలసలు...
స్థానిక జల నిపుణులు, పంచాయతీలతో కలిపి నీటి వనరుల పునరుద్ధరణ గురించి ప్రణాళికలు రచించారు గజాలా. ముందుగా అక్కడున్న బావులు, కుంటల్లో పూడిక తీయించారు. దాంతో వర్షాకాలం వచ్చేసరికి అవన్నీ నిండుకుండల్లా తొణికిస లాడాయి. ప్రతి ఇంటి దగ్గర ఇంకుడు గుంతలు తవ్వించి వర్షపు నీరు భూమిలోకి ఇంకేలా చేశారు. ఈ కార్యక్రమాన్ని చుట్టుపక్కల 97 గ్రామాలకు విస్తరించారు. ఫలితంగా 2009కి ముందు...కరవుతో ఇతర ప్రాంతాలకు వలసపోయిన రైతులు తిరిగి స్వస్థలాలకు చేరుకున్నారు. వారంతా వ్యవసాయం చేస్తూ మరికొంతమందికీ ఉపాధి కల్పిస్తున్నారు. ఒకప్పుడు సాగులో ఏడాదికి రూ.పది వేలు ఆర్జించడం కనాకష్టంగా భావించిన అన్నదాతలు ఇప్పుడు ఏడాది పొడవునా పంటలు పండిస్తున్నారు. లాభాలూ అందుకుంటున్నారు. సమర్థ్ కృషి వల్ల రాపార్‌లో అయిదు వేల మందికి లబ్ధి చేకూరింది. 2009కి ముందుతో పోల్చితే వలసలు 70 నుంచి ముప్పై శాతానికి తగ్గాయి. ప్రస్తుతం అక్కడ 675 నీటి కుంటలు, బావులు, వాన నీటి నిల్వ వనరులు, దిగుడు బావులు నీటితో కళకళలాడుతున్నాయి. నీటి వనరుల నిర్వహణ, పరిరక్షణ కోసం ఆ ప్రాంతంలో స్వచ్ఛంద కార్యకర్తలను కూడా నియమించింది సమర్థ్.
‘క్షేత్రస్థాయిలో సమస్యల్ని పరిష్కరించడానికి పెద్ద పెద్ద సరంజామా, భారీ నిధులు అవసరం లేదు. ప్రజల భాగస్వామ్యం, స్థానిక సంస్థల సహకారం చాలు’ అంటారు గజాలా. ఈ పనులన్నీ చెయ్యడానికి దాతలు, కార్పొరేట్ల సాయంతో పాటు ప్రభుత్వ పథకాలను ఆమె ప్రధానంగా ఉపయోగించుకున్నారు. ఉపాధి హామీ పథకాన్నీ, నీటి వనరుల నిర్మాణం కోసం ఇతర ప్రభుత్వ పథకాలను ఆశ్రయించారు. వర్షపాతం పెంచేలా ఆయా ప్రాంతాల్లో మొక్కలు నాటించారు. ప్రతి మనిషీ హుందాగా జీవించాలన్నది ఈ సంస్థ నినాదం. ప్రస్తుతం గజాలా దీనికి మేనేజింగ్ ట్రస్టీ, ఫౌండర్ మెంబర్‌గా ఉన్నారు. దివ్యాంగుల సంక్షేమం, పేదలకు ఉపాధి, పిల్లల చదువు కోసం కూడా సమర్థ్ సంస్థ కృషి చేస్తోంది. ఇప్పటి వరకూ ఈ సంస్థ 129 గ్రామ పంచాయతీల్లో సేవలందించింది. నలభై ఒక్క వేల మందికి పైగా సాయం చేసింది. పట్టుదల, ప్రణాళిక ఉంటే సేవకు ఆకాశమే హద్దు అని నిరూపిస్తున్నారు గజాలా.
ఇదీ చూడండి: 'చావు అంచుల వరకు వెళ్లినా.. పంథా మార్చుకోలే'