మల్బరీ సాగుచేసి పట్టుగూళ్లను ఉత్పత్తి చేస్తే లాభాలు తథ్యమని రాష్ట్ర ఉద్యానశాఖ చెబుతోంది. గత ఆరునెలల్లోనే దేశంలో నాణ్యమైన పట్టు (సిల్క్) కిలో ధర రూ.3,000 నుంచి రూ. 5,500 గరిష్ఠస్థాయికి చేరిందని అంటోంది. చైనాలో పట్టు ఉత్పత్తి, అక్కడి నుంచి దిగుమతులు తగ్గడంతో మన పట్టు రైతులకు లాభాలొస్తున్నాయి. ప్రస్తుతం తెలంగాణలో కిలో పట్టుగూళ్ల ధర రూ. 460 నుంచి రూ. 505 పలుకుతోంది. గత ఏప్రిల్ నెలలో రూ. 170 నుంచి 200 ఉండేది. దేశంలో పట్టుకు డిమాండ్ పెరగడంతో రాష్ట్రంలో పట్టుగూళ్ల ధరలు పుంజుకున్నాయి.
మనదేశంలో పట్టు వినియోగం ఏటా 68 వేల టన్నులుండగా ఉత్పత్తి 32 వేల టన్నులు మాత్రమే. గతంలో చైనా నుంచి ఎక్కువగా దిగుమతయ్యేది. కానీ అక్కడ వాతావరణంలో మార్పులు, కూలీల కొరత వంటి సమస్యల వల్ల దిగుమతి పడిపోయింది. ఇక్కడ కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణలో పట్టుగూళ్ల ఉత్పత్తి ఎక్కువగా ఉంది. తేమతో కూడిన వాతావరణం, సమశీతోష్ణస్థితి ఉన్నందున తెలంగాణలో మల్బరీ సాగుకు మంచి అవకాశాలున్నాయని జాతీయ పట్టు అభివృద్ధి మండలి సిఫార్సు చేసింది. ప్రస్తుతం ఏటా 11 వేల ఎకరాల మల్బరీ సాగుతో 2,853 మెట్రిక్ టన్నుల పట్టు తెలంగాణలో ఉత్పత్తవుతోంది. ఇది మరో 4 రెట్లు పెంచాల్సిన అవసరముందని ఉద్యానశాఖ అంచనా.
వరికి బదులు మల్బరీ మేలు
వరికి ప్రత్యామ్నాయంగా మల్బరీసాగు, పట్టు పురుగుల పెంపకం చాలా మేలు. ఆసక్తి ఉన్న రైతులు మల్బరీ సాగుతో లాభాలు సాధించవచ్చు. తెలంగాణలో నాణ్యమైన బైవోల్టిన్ రకం పట్టు ఉత్పత్తవుతుందని కేంద్రం గతంలో ప్రశంసించింది. ఈ రకం పట్టుకు మార్కెట్‌లో ఏడాది పొడవునా డిమాండు ఉంది. రైతులు మల్బరీ సాగు ప్రారంభిస్తే రూ.25 వేలు, పట్టుగూళ్ల షెడ్ నిర్మించుకుంటే రూ.2 లక్షల సాయం చేస్తాం.
- ఎల్.వెంకట్రాంరెడ్డి, సంచాలకుడు, ఉద్యానశాఖ
మండువేసవిలోనూ అధిక దిగుబడి..
- గత వేసవిలో మండుటెండలలో సైతం పట్టుగూళ్ల షెడ్‌పై రోజూ నీటి తుంపర్లు చల్లి అనుకూల వాతావరణం సృష్టించి నల్గొండ జిల్లా కనెగల్లు మండలం రైతు జెల్లా పుండరీకం పట్టు పురుగులను పెంచి 70 శాతం దిగుబడి సాధించారు.
- సిద్దిపేట జిల్లా చందలాపూర్ గ్రామ రైతులు పెద్దోల నర్సింహులు, ఐలయ్య, రాంరెడ్డి తుంపర్ల సాగు పద్ధతిలో తొంభై శాతం దిగుబడి సాధించారు.
- నల్గొండ జిల్లా చిట్యాల మండలం వానిపాకల రైతు సామ ఉపేందర్‌రెడ్డి రెయిన్‌గన్‌లు పెట్టి కృత్రిమ వర్షపు జల్లులతో మల్బరీ సాగు చేసి 90% దిగుబడి సాధించినట్లు ఉద్యానశాఖ తెలిపింది.
- తుమ్మలపల్లి, పాటిమట్ల, నంద్యాలవారి గూడెం, ధన్నసరి, బెండలపహాడ్ తదితర గ్రామాల్లో రైతులు బృందాలుగా ఏర్పడి మల్బరీ సాగు చేస్తున్నారు.
- గత నెల ఒకటిన జనగామ మార్కెట్లో చిట్యాల గ్రామ రైతు గోపాల్‌రెడ్డి కిలో రూ.501కి అమ్మగా ఇటీవల సికింద్రాబాద్ తిరుమలగిరి మార్కెట్‌లో నల్గొండ జిల్లా బెండలపహాడ్ గ్రామ రైతు జగదీష్‌రెడ్డికి రూ. 505 వచ్చింది.
- కిలో పట్టుగూళ్ల ఉత్పత్తి వ్యయం రూ.200 అవుతున్నందున లాభాలు వచ్చినట్లు రైతులు తెలిపారు.
ఇదీ చూడండి: పట్టు పురుగుల పెంపకం.. దిగుబడి ఆశాజనకం