Pradhan Mantri Awas Yojana: ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం(పీఎంఏవై/పట్టణ) కింద రాష్ట్రానికి కొత్తగా ఇళ్లు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ మేరకు కొద్ది రోజుల క్రితం ప్రతిపాదనలు పంపింది. 1.69 లక్షల ఇళ్లు మంజూరు చేయాలని కోరినట్లు గృహనిర్మాణ శాఖ వర్గాలు తెలిపాయి. త్వరలో దిల్లీలో జరిగే జాతీయ మంజూరు కమిటీ సమావేశంలో రాష్ట్రాల వారీగా వచ్చిన ప్రతిపాదనలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. ఆ భేటీ తర్వాత రాష్ట్రానికి ఎన్ని ఇళ్లు వస్తాయన్న విషయంపై స్పష్టత రానుంది.
పీఎంఏవైలో అందరికీ ఇళ్లు పథకాలను పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు వేర్వేరుగా అమలు చేస్తున్నారు.ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వానికి పీఎంఏవై-పట్టణ కింద ప్రతిపాదనలు పంపారు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) నుంచి పట్టణాల వారీగా వచ్చిన వివరాల ఆధారంగా ఈ ప్రతిపాదనల్ని రూపొందించారు. ఈ పథకం కింద ఒక్కో ఇంటికి కేంద్ర ప్రభుత్వం రూ.1.50 లక్షల నిధులు ఇస్తుంది. 2016-17, 2017-18లో 1.53 లక్షల ఇళ్లు మంజూరు కాగా నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి.
పనితీరు ఆధారంగా మంజూరు!
రాష్ట్రాలకు కొత్తగా ఎన్ని ఇళ్లు మంజూరు చేయాలన్న విషయంలో గతంలో మంజూరు చేసిన ఇళ్ల విషయంలో పనితీరును కేంద్రం ప్రామాణికంగా తీసుకోనుంది. మంజూరు చేసిన ఇళ్లను సకాలంలో నిర్మించారా? ఆలస్యం అవుతోందా? వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని...పనితీరు బాగుంటే అధికంగా, లేదంటే ప్రతిపాదనల కంటే తక్కువ మంజూరుచేసే అవకాశం ఉంటుందని సమాచారం.
రూ.190 కోట్లే వచ్చాయి
పీఎంఏవై-గ్రామీణ్ కింద ఒక్కో ఇంటికి కేంద్రం రూ.72 వేలు ఇస్తోంది. గతంలో రాష్ట్రానికి 50,959 ఇళ్లు మంజూరయ్యాయి. రూ.381.58 కోట్లు కేంద్రం వాటా కాగా, రూ.190 కోట్ల నిధులు మాత్రమే వచ్చాయని, మిగతా మొత్తం రావాల్సి ఉందని గృహనిర్మాణశాఖ వర్గాలు చెబుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఇళ్ల లబ్ధిదారుల ఎంపికకు మార్గదర్శకాలు పాటించాలని కేంద్రం నిబంధనలు విధించింది. సామాజిక కులగణన సర్వే-2011 ప్రకారం లబ్ధిదారులను ఎంపిక చేయాలని, లబ్ధిదారుల పేర్లతో జాబితాను అప్‌లోడ్ చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్రాన్ని కోరింది. అయితే ఈ ప్రక్రియ జరక్కపోవడంతో కొత్తగా గ్రామీణ ప్రాంతాలకు ఇళ్ల మంజూరు (పీఎంఏవై-గ్రామీణ్)ను కేంద్రం నిలిపివేసింది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం గ్రామీణ ప్రాంతాల ఇళ్లకు నిబంధనల్ని సడలించాలని కోరుతోంది. ఇప్పటికే రెండు సార్లు లేఖలు రాసింది.
ఇదీ చదవండి: