కొవిడ్ దృష్ట్యా నూతన సంవత్సర వేడుకలకు ఏపీ ప్రభుత్వం నిరాకరించింది. ప్రజలు గుమిగూడకుండా పలు ఆంక్షలు విధించింది. ఈ క్రమంలో ఇంట్లోనే వేడుకలు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను పట్టించుకోకుండా ఎవరైనా రోడ్లపైకి వస్తే సహించబోమని వారు హెచ్చరిస్తున్నారు. ప్రజలు తమకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
కొత్త రకం కరోనా వ్యాప్తి క్రమంలో వేడుకలను ఇంట్లో జరుపుకోవాలి. హోటళ్లు, పబ్బులు, ఫంక్షన్ హాళ్లు, బహిరంగ ప్రదేశాల్లో వేడుకల నిర్వహణకు అనుమతి లేదు. ఆదేశాలను ఉల్లంఘించిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం. మద్యం దుకాణాలు, రెస్టారెంట్లు నిర్ణీత సమయం వరకే ఉంటాయి. ఆలయాలు, ప్రార్థనా మందిరాల్లో యధావిధిగా పూజలు, ప్రార్థనలు చేసుకోవచ్చు- బి .శ్రీనివాసులు, విజయవాడ పోలీస్ కమిషనర్
డిసెంబర్ 31న రాత్రి పది గంటల తర్వాత దుకాణాలన్నీ మూసివేయాలి. రోడ్లపై కేకులు కోయడం, బాణసంచా కాల్చడం నిషిద్ధం. ఇవాళ నగరంలో పెద్ద ఎత్తున డ్రంక్ అండ్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఎవరైనా మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసులు నమోదు చేస్తాం - కేవీ మహేష్, కర్నూలు డీఎస్పీ
బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలు జరపడానికి వీల్లేదు. జిల్లావ్యాప్తంగా ప్రత్యేక నిఘా కొనసాగుతుంది. మద్యం మత్తులో వాహనాలు నడిపినా, సైలెన్సర్లు తొలగించి అధిక శబ్ధాలతో ఇతరులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు. ప్రజల భద్రతకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే ఊరుకోం. మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. - ఏసుబాబు, అనంతపురం ఎస్పీ
ఇదీ చదవండి: 'బహిరంగ ప్రదేశాల్లో గుమిగూడితే కఠినచర్యలే'