కరోనా సంక్షోభంతో చాలా కుటుంబాలు రోడ్డునపడ్డాయని.. ఎంతో మంది తమ ఆప్తులను కోల్పోయారని మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ఉపాధి కోల్పోయిన కుటుంబాలను ఆదుకునేందుకు స్వచ్ఛంద సంస్థలు, ఆర్థికంగా ఉన్న వారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. 'కొవిడ్ కల్లోలంలో రాష్ట్రం-పట్టించుకోని ప్రభుత్వం' అనే అంశంపై ప్రొఫెసర్ జయశంకర్ మానవ వనరుల అభివృద్ధి కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించిన చర్చా గోష్ఠిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూపాయి ఖర్చు లేకుండా వ్యాక్సిన్ ఇస్తామన్న హామీకి ప్రభుత్వం కట్టుబడి ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వపరంగా కరోనాకు సంబంధించిన అన్ని రకాల మందులను అందుబాటులో ఉంచాలని కోరారు.
దురదృష్టకరం..
దేశంలో వైద్య రంగానికి తక్కువ బడ్జెట్ కేటాయించిన రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని చేవేళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి విమర్శించారు. ధనిక రాష్ట్రంలో వైద్యరంగానికి తక్కువ నిధులు కేటాయించడం దురదృష్టకరమన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు లేవని.. వైద్య సిబ్బందికి జీతాలు సరిగా రావడం లేదని ఆయన మండిపడ్డారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దృష్టి ప్రజల ప్రాణాల మీద కాకుండా.. రాజకీయాల మీద ఉందని ఆక్షేపించారు.
పూర్తిగా విఫలం..
కరోనాను అరికట్టడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెజస అధ్యక్షుడు కోదండరాం విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు రాజకీయాల మీద ఉన్న శ్రద్ధ.. ప్రజల ప్రాణాల మీద లేదని మండిపడ్డారు.
ఇదీ చూడండి: KTR : పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వేకు రెండు కొత్త ర్యాంపులు ప్రారంభం