మినీ పురపోరులో కొవిడ్ నిబంధనలను పూర్తి స్థాయిలో పాటించినట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పార్థసారథి తెలిపారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా పోలింగ్ తీరుతెన్నులను పరిశీలించడంతో పాటు ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లోని కలెక్టర్లు, పోలీసు అధికారులు, ఎన్నికల అధికారులతో నిత్యం పర్యవేక్షించినట్లు చెప్పారు. పోలింగ్ కేంద్రాల బయట చిన్నపాటి ఘర్షణలు తప్ప పోలింగ్ పూర్తిగా సాఫీగా సాగిందని... ఓటర్లు స్వచ్చందంగా కొవిడ్ నిబంధనలను పాటించినట్లు ఎస్ఈసీ వివరించారు. పోలింగ్ కేంద్రానికి 730 మంది వరకు ఓటర్లు ఉండేలా చూడడంతో ఎక్కడా సమ్మర్ధం కూడా లేదని చెప్పారు.
అధికారులు, సిబ్బంది పూర్తిగా కొవిడ్ నిబంధనలు పాటించి, అమలు చేశారని పార్థసారథి తెలిపారు. ఎస్ఈసీ ఆదేశాల ప్రకారం అధికారులు కొవిడ్ నిబంధనలను అమలు చేయడంతో ఓటర్లలో విశ్వాసం కలిగిందని చెప్పారు. రిసెప్షన్ సెంటర్ల వద్ద కూడా ఎక్కువ రద్దీ లేకుండా వీలైనన్ని ఎక్కువ కౌంటర్లు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వివరించారు. విధుల అనంతరం పోలింగ్, పోలీసు సిబ్బందిని 50శాతం సీటింగ్ కెపాసిటీ ఉండేలా వాహనాల్లో వారి గమ్యస్థానాలకు చేర్చాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆదేశించారు.
ఇదీ చదవండి: ప్రశాంతంగా ముగిసిన మినీపురపోరు