జీహెచ్ఎంసీ ఎన్నికలకు సంబంధించి హైదరాబాద్లోని ఎన్నికల సంఘం కార్యాలయంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సి. పార్థసారధి పోలీస్ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ మహేందర్ రెడ్డి, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లోకేశ్ కుమార్, హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సీపీలు అంజనీ కుమార్, వీసీ సజ్జనార్, మహేశ్ భగవత్, అడిషనల్ డీజీపీ (శాంతి భద్రతలు) జితేంద్ర, సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఇతర పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఆయుధాలను పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలి
జీహెచ్ఎంసీ పరిధిలోని 150 వార్డులు నాలుగు జిల్లాల్లో ఉండగా... 6 జోన్లు, 30 సర్కిల్స్ పరిధిలో దాదాపు 74 లక్షల ఓటర్లు, 8000 పైచిలుకు పోలింగ్ కేంద్రాలు ఉంటాయని ఈ సమావేశంలో అంచనాకు వచ్చారు. శాంతిభద్రతలు కాపాడుతూ స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడటంపై విస్తృతంగా చర్చించారు. ఎన్నికల సమయంలో లైసెన్స్ లేని ఆయుధాలు సీజ్ చేయాలని... లైసెన్స్ ఆయుధాలు కలిగిన వారు తమ ఆయుధాలను ఎన్నికల ప్రక్రియ ముగిసే వరకు సంబంధిత పోలీస్ స్టేషన్లలో డిపాజిట్ చేయాలని కమిషనర్ చెప్పారు. క్షేత్రస్థాయిలో బీట్ పెట్రోలింగ్ పెంచటంతో పాటు సీసీ కెమెరాల ద్వారా నిరంతర పర్యవేక్షణ చేస్తూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించిన వ్యక్తులు, శక్తులను చట్ట ప్రకారం శిక్షించాలని స్పష్టం చేశారు.
24 గంటలు నిఘా ఉండాలి
రెవెన్యూ, పురపాలక శాఖ అధికారులతో కలిసి సమస్యాత్మక, అతి సమస్యాత్మక కేంద్రాలను గుర్తించాలని.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రోజు నుంచి మున్సిపల్ సర్కిళ్లల్లో పరిస్థితులను బట్టి తగినన్ని స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు, ఫ్లైయింగ్ స్క్వాడ్లు, చెక్ పోస్టులు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తు ప్రణాళిక తయారు చేయాలని.. సమస్యలు సృష్టించే అరాచక శక్తులపై 24 గంటలు నిఘా పెట్టాలన్నారు. పోలీస్ అధికారులు సంబంధిత జీహెచ్ఎంసీ అధికారులతో సంప్రదించి యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుంటామని డీజీపీ మహేందర్ రెడ్డి చెప్పారు. ఎటువంటి వివక్ష లేకుండా పారదర్శకంగా శాంతి భద్రతలు కాపాడుతామని భరోసా ఇచ్చారు. ఈ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని డీజీపీ పేర్కొన్నారు.
ఇదీ చదవండి: 15వ కాన్పులో ఆడపిల్ల- నెరవేరిన 30ఏళ్ల కల