దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి 14 లక్షల కోట్ల రూపాయలు కేంద్రం లబ్ధి పొందుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్, కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి ఆరోపించారు. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు తగ్గినా... దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. భాజపా అధికారంలోకి వచ్చిన 2014 నుంచి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్‌పై రెండు వందల శాతం పన్నులు పెంచారని ఆరోపించారు. ఇప్పటి వరకు పెట్రోల్, డీజిల్ ధరలను 30 రూపాయలకుపైగా పెంచారన్నారు.
కరోనాతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్లు అయ్యిందన్నారు. 2014లో పెట్రోల్, డీజిల్ ధరలు పేరుతో అధికారంలోకి వచ్చిన భాజపా ఇప్పుడేం చేస్తోందని ప్రశ్నించారు. పెట్రోల్, డీజిల్ ధరల ప్రభావం నిత్యావసర వస్తువులపై కూడా పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పీవీ నరసింహారావుతో కలిసి పనిచేసే అవకాశం తనకు దక్కిందని కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి పేర్కొన్నారు. పార్టీ అవకాశాలు ఇవ్వడం వల్లే పీవీ నరసింహారావు ప్రధాన మంత్రి అయ్యే అవకాశం వచ్చిందన్నారు.
ఇదీ చూడండి: సరిహద్దులో యుద్ధ మేఘాలు- క్షిపణులు మోహరిస్తున్న భారత్!