రాష్ట్ర వార్షిక బడ్జెట్ కసరత్తు కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సర బడ్జెట్ అంచనాలు, రాబడులను విశ్లేషించుకొని కొత్త బడ్జెట్ ప్రతిపాదనలను ఖరారు చేయనున్నారు. 2019-20 ఆర్థిక సంవత్సరానికి భూముల అమ్మకం ద్వారా పదివేల కోట్లు సహా లక్షా 36 వేల కోట్ల పద్దును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. జనవరి వరకు రాబడుల్లో వృద్ధిరేటు ఆరు శాతంగా ఉంది. చివరి త్రైమాసికంలో కొంత మెరుగ్గా ఉండవచ్చన్న ఆశాభావంతో ప్రభుత్వ వర్గాలు ఉన్నాయి. ఆ మేరకు ప్రస్తుత ఏడాది బడ్జెట్ అంచనాలను సవరించనున్నారు. సవరించిన అంచనాలపై 12 నుంచి 15 శాతం వరకు 2020-21 పద్దు ప్రతిపాదనలు ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల కొత్త బడ్జెట్ పద్దు లక్షా యాభై వేల కోట్లకు పైగా ఉండవచ్చని అంచనా.
శాఖల ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు:
ప్రభుత్వ ప్రాధాన్య పథకాలైన రైతుబంధు, ఆసరా ఫించన్లు, బోధనా రుసుముల చెల్లింపులు, ఉపకార వేతనాలు, కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ తదితరాలకు ఆ శాఖల ప్రతిపాదనలకు అనుగుణంగా నిధులు కేటాయించనున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులు, మిషన్ భగీరథ, రెండు పడకల గదుల ఇళ్ల నిర్మాణానికి బడ్జెటేతర రూపాల్లో నిధులు సమీకరించనున్నారు. దాంతో పాటు బడ్జెట్లోనూ కొంత మేర నిధులు కేటాయించే అవకాశం ఉంది. వీటితో పాటు ఎన్నికల హామీలైన రైతురుణమాఫీ, ఉద్యోగుల వేతన సవరణకు కూడా బడ్జెట్లో ఈ మారు నిధుల కేటాయింపులు ఉంటాయని సమాచారం.
ఇవీ చూడండి: 'కరోనా ఎఫెక్ట్: షేక్ హ్యాండ్ వద్దు.. నమస్కారం చాలు'