Bandi Sanjay teleconference: అకాల వర్షాలతో రాష్ట్రంలో రైతులు పంట నష్టపోయి కోలుకోని విధంగా దెబ్బతిన్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే బీజేపీ నేతలంతా రైతులకు అండగా నిలవాలని కోరారు. అందులో భాగంగా ఈరోజు, రేపు జిల్లా నేతలంతా దెబ్బతిన్న పొలాల వద్దకు వెళ్లి పంట నష్టం వివరాలను సేకరించాలని ఆదేశించారు. ఆ వివరాలతో నివేదిక రూపొందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ఈ నెల 27న జిల్లా కలెక్టర్లకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పారు.
నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: ప్రభుత్వం నుంచి వచ్చే స్పందనకు అనుగుణంగా చర్యలు చేపడతామని బీజేపీ ఓ ప్రకటనలో పేర్కొంది. పార్టీ జిల్లా అధ్యక్షులు, ఇంఛార్జ్‌లు, కిసాన్ మోర్చా నాయకులతో బండి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శులతో టెలికాన్ఫరెన్స్‌లో వడగళ్ల వానతో నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి చర్చించారు. ఈనెల 30న ప్రధాని మోదీ నిర్వహిస్తున్న మన్ కీ బాత్, బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాలపై చర్చించారు.
ఎక్కువగా నష్టపోయింది కౌలు రైతులే: వరుసగా కురుస్తోన్న వడగళ్ల వానలతో రాష్ట్ర రైతాంగంపై కోలుకోని దెబ్బపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికొచ్చిన పంట చాలా చోట్ల పూర్తిగా కొట్టుకుపోయాయి.. పంట నాశనమయిందని పేర్కొన్నారు. ఎక్కువగా నష్టపోయింది కౌలు రైతులేనని అన్నారు. అప్పు తెచ్చి కౌలుకు తీసుకుంటే పంట నష్టపోయినందున అప్పులెలా తీర్చాలో.. కౌలు పైసలు ఎలా కట్టాలో? కుటుంబాన్ని ఎలా నెట్టుకురావాలో అర్ధం అవ్వక ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. గత నెల కురిసిన వర్షాలకు వేల ఎకరాల్లో పంట నష్టపోతే.. ఎకరానికి రూ.10 వేలు సాయం చేస్తానని మాట ఇచ్చిన కేసీఆర్ ఇప్పటి వరకు డబ్బులు ఇవ్వలేదని మండిపడ్డారు. ఈసారి వడ్ల కొనుగోలు కేంద్రాలను సకాలంలో తెరిచి ఉంటే 30 నుంచి 50 శాతం మంది రైతులు పంట నష్టపోయే వాళ్లు కాదనీ స్పష్టం చేశారు.
మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను పండగలా చేయాలి: ఈ నెల 30న ప్రధాని మోదీ నిర్వహించే మన్ కీ బాత్ 100వ ఎపిసోడ్‌ను పండగలా నిర్వహించాలని పిలుపునిచ్చారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 100 కేంద్రాలను ఏర్పాటు చేయాలని సూచనలు ఇచ్చారు. స్థానిక ప్రజలకు మన్ కీ బాత్ కార్యక్రమాలు చూసేలా చూడాలన్నారు. ఇప్పటి వరకు చేపట్టిన బూత్ స్వశక్తీకరణ అభియాన్ కార్యక్రమాల వివరాలను రేపటిలోగా పంపించాలని ఆదేశించారు.
ఇవీ చదవండి: