Margadarsi Chit Funds Latest News: మార్గదర్శి చిట్‌ఫండ్స్ ప్రైవేట్ లిమిటెడ్‌లో అవకతవకలు గుర్తించామని.. ఏపీ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ రామకృష్ణ తెలిపారు. రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదన్నారు. చిట్‌ఫండ్ నిధులను నాన్-చిట్‌ఫండ్ కార్యకలాపాలకు మళ్లించినట్లు కనిపిస్తోందని చెప్పారు. ఈ అంశంపై.. ప్రత్యేక ఆడిట్, ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహిస్తామని సచివాలయంలో నిర్వహించిన సమావేశంలో.. రామకృష్ణ తెలిపారు. మార్గదర్శి చిట్‌ఫండ్ కార్యకలాపాలపై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు లేవన్నారు.
ఐతే, మోసాలు జరిగేంత వరకు వేచి ఉండకూడదనే.. మిగిలిన చిట్‌ఫండ్స్‌పై చేసినట్లు మార్గదర్శిలోనూ తనిఖీలు చేశామన్నారు. మార్గదర్శి కార్యాలయాల్లో గుర్తించిన లోపాలపై... వారం రోజుల్లో షోకాజ్ నోటీసు జారీచేసి, వివరణ కోరతామని రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ఐజీ వివరించారు.తెలంగాణ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ ద్వారా.. హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్‌ఫండ్ ప్రధాన కార్యాలయంలో వచ్చే నెల 7, 8, 9 తేదీల్లో లేకుంటే 14, 15 తేదీల్లో.. తనిఖీలు నిర్వహిస్తామని వెల్లడించారు. తమకు ఎవరిపైనా వివక్షలేదన్న ఆయన..పూర్తి సమాచారం లేనందున ఎంత డిపాజిట్ మొత్తాన్ని మార్గదర్శి నుంచి మళ్లించారో చెప్పలేకపోతున్నట్లు వివరించారు.